ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విధించిన బెయిల్‌ నిబంధనలను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఓ చీటింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విధించిన కొన్ని నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది.

Published : 02 Dec 2022 04:27 IST

చీటింగ్‌ కేసులో మూడు షరతులు అత్యంత కఠినంగా ఉన్నాయని వెల్లడి

దిల్లీ: ఓ చీటింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విధించిన కొన్ని నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. వియత్నాంలో నివసిస్తున్న వ్యక్తిని వారంలో రెండుసార్లు పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలనడం, బ్యాంకు ఖాతా, ఆస్తుల వివరాలను పొందుపరచాలని ఆదేశించడం దుర్భరమైన నిబంధనలుగా సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దివాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కఠినమైన మూడు నిబంధనలను కొట్టివేస్తున్నామని, మిగతావి కొనసాగుతాయని వెల్లడించింది. ఎ.నందాకుమార్‌, మరో ఇద్దరు వ్యక్తులు దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు దంపతులు. వీరిలో ఒకరు వియత్నాంలో, మరొకరు బెంగళూరులో నివసిస్తున్నారు. చీటింగ్‌ కేసులో అభియోగపత్రం దాఖలయ్యే వరకు ముగ్గురు నిందితులు ప్రతి బుధ, ఆదివారాల్లో తెలంగాణ పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ 2013 ఆగస్టు 1న ముందస్తు బెయిల్‌ షరతుల్లో హైకోర్టు పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండో నిబంధన... అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత విచారణ/దర్యాప్తు పూర్తయ్యే వరకూ నిందితులు ప్రతి నెలలో తొలి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌ అధికారి ఎదుట హాజరుకావాలి. విచారణ ముగిసే వరకు సంబంధిత జడ్జి అనుమతి లేకుండా రాష్ట్రాన్ని వీడి వెళ్లకూడదు. ఇక మూడో నిబంధన.. చిరునామా, ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలను సమర్పించడం. ఈ మూడు నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. మిగిలిన బెయిల్‌ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దంపతుల్లో ఒకరు వియత్నాంలో, మరొకరు బెంగళూరులో ఉన్నప్పుడు వారంలో రెండు సార్లు పోలీస్‌ స్టేషన్‌కు రావడం చాలా కష్టమవుతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని