ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్రం నిర్లక్ష్యం

కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని భగత్‌సింగ్‌ మేనల్లుడు ఆచార్య జగ్‌మోహన్‌సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 02 Dec 2022 05:47 IST

పీడీఎస్‌యూ మహాసభల్లో భగత్‌సింగ్‌ మేనల్లుడి విమర్శ

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని భగత్‌సింగ్‌ మేనల్లుడు ఆచార్య జగ్‌మోహన్‌సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ మైదానంలో గురువారం పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జరిగిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ, అమిత్‌షాల నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశభక్తి ముసుగులో ప్రజల్ని మతం ప్రాతిపదికన విడదీస్తోందని ఆరోపించారు. ఆకలి, అసమానతలు, పేదరికం, నిరుద్యోగ సమస్యలు తీవ్రంగా పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ప్రసాద్‌ల స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలని యువతకు పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కుల్ని తుంగలో తొక్కేలా ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్‌ కృష్ణ, ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి బూర్గుల ప్రదీప్‌ మండిపడ్డారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, రాజరాజేంద్ర చౌరస్తా నుంచి వందల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల పీడీఎస్‌యూ బాధ్యులు హాజరై ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని