పట్టుదలకు తలవంచిన పర్వతాలు

ప్రమాదంలో ఓ కాలు, చేయి కోల్పోయారు. అయినా నిరాశను దరిచేరనీయకుండా కృత్రిమ కాలు సాయంతో పర్వత శిఖరాలను అధిరోహిస్తూ ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలుస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌కు చెందిన చిదుగుల్ల శేఖర్‌గౌడ్‌ (31).

Updated : 03 Dec 2022 07:24 IST

ప్రమాదంలో ఓ కాలు, చేయి కోల్పోయారు. అయినా నిరాశను దరిచేరనీయకుండా కృత్రిమ కాలు సాయంతో పర్వత శిఖరాలను అధిరోహిస్తూ ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలుస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌కు చెందిన చిదుగుల్ల శేఖర్‌గౌడ్‌ (31). 5,364 మీటర్ల ఎత్తున ఉన్న ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు, రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తయిన మౌంట్‌ ఎల్బరస్‌, ఆఫ్రికాలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో పర్వతాలను అధిరోహించి.. సగర్వంగా భారత జెండా ఎగరేశారు. ప్రస్తుతం అర్జెంటీనాలోని నాలుగో ఎత్తయిన అకంకాగ్వా పర్వతాన్ని ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.  ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే దీంతో పాటు మరిన్ని శిఖరాలు అధిరోహిస్తానని చెబుతున్నారు.

మలుపు తిప్పిన మారథాన్‌..

నిరుపేద కుటుంబానికి చెందిన శేఖర్‌ 2006లో నల్గొండలో ఐటీఐ చదివే రోజుల్లో ఇంటి పిట్టగోడపై నుంచి జారి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయారు. తీవ్ర గాయాల కారణంగా కుడి చేతిని, ఎడమ కాలిని వైద్యులు తొలగించారు. అనంతరం కొన్నాళ్లు సెల్‌ఫోన్‌ రిపేర్‌ దుకాణం నిర్వహించారు. 2014లో చెన్నైకి చెందిన దస్తగిరి ప్రోత్సాహంతో హైదరాబాద్‌ మారథాన్‌లో పాల్గొన్న శేఖర్‌ ఇక వెనుదిరిగి చూడలేదు. భారత కృత్రిమ అవయవ బ్యాంకు నుంచి కృత్రిమ కాలు, బ్లేడ్‌ పొంది.. బ్లేడ్‌ రన్నర్‌గా పది కిలోమీటర్ల పోటీల్లో సత్తా చాటారు. దేహ్రాదూన్‌ హాఫ్‌ మారథాన్‌ను 3 గంటల 39 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించార[ు. ఇప్పటివరకు 30కి పైగా మారథాన్‌ పోటీల్లో పాల్గొన్నారు. కృత్రిమ కాలుతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 4,100 కిలోమీటర్ల దూరం ఒంటరిగా 48 రోజుల్లో సైకిల్‌యాత్ర పూర్తి చేశారు. ఇందుకుగానూ ‘హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో శేఖర్‌ పేరు నమోదైంది. ఈ ప్రోత్సాహంతో ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఇప్పటివరకూ మూడింటిని అధిరోహించారు. పేద కుటుంబం కావడంతో.. క్రౌడ్‌ ఫండింగ్‌ సాయం తీసుకున్నారు. ఇప్పుడు 6,961 అడుగుల ఎత్తయిన అకంకాగ్వా పర్వతంపై దృష్టి పెట్టారు. ఈ పర్వతారోహణకు రూ.14 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. జీవనోపాధికి హైదరాబాద్‌ మదీనాగూడలోని ప్రణమ్‌ ఆసుపత్రిలో పేషెంట్‌ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు శేఖర్‌.

- న్యూస్‌టుడే, చౌటుప్పల్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు