దూదిపూల దుఃఖం.. ఇంతింత కాదయా!
పత్తి రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది అరకోటి ఎకరాల్లో పత్తిపంట సాగయినా దిగుబడి నిరాశాజనకంగా ఉండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.
పత్తి దిగుబడి లేక పెట్టుబడీ రాదాయె
మార్కెట్‌కు అరకొర పంట.. పెచ్చుపెరిగిన ధర
వర్షాలు, తెగుళ్లు దెబ్బతీశాయని రైతుల ఆవేదన
ఈనాడు, హైదరాబాద్: పత్తి రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది అరకోటి ఎకరాల్లో పత్తిపంట సాగయినా దిగుబడి నిరాశాజనకంగా ఉండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ సీజన్‌లో పత్తి పంటను ప్రైవేటు వ్యాపారులే మద్దతు ధరకు మించి కొంటున్నా కర్షకులకు ఆశనిపాతం తప్పలేదు. క్వింటా మద్దతు ధర రూ.6,380 కాగా వ్యాపారులు రూ.8వేలకు పైగా చెల్లించడానికి ముందుకొస్తున్నారు. గతంలో మద్దతు ధర కోసం రైతులు ఆందోళనకు దిగితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ)తో పంట కొనిపించేది. ఈ ఏడాది అసలు అలాంటి పరిస్థితే లేదు. వ్యాపారులు ఎగబడి కొనడానికి కారణం రైతుల వద్ద పంట పెద్దగా లేకపోవడమేనని మార్కెటింగ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. అధిక వర్షాలు, తెగుళ్లతో పంట దెబ్బతినడంతో మార్కెట్లకు పత్తి పెద్దగా రావడం లేదు. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో పంట సాగవగా ఇందులో ఉత్తర తెలంగాణలోని 19 జిల్లాల పరిధిలోనే 31.12 లక్షల ఎకరాలుంది. ఈ జిల్లాల మార్కెట్లకు ఇప్పటివరకూ 8.91 లక్షల క్వింటాళ్ల పత్తినే అమ్మకానికి తెచ్చారు. అంటే కనీసం ఎకరానికి క్వింటా పత్తి కూడా మార్కెట్లకు రాలేదని విశ్లేషణలో తేలింది. గతేడాది ఇదే సమయానికి ఇవే జిల్లాల్లో 18.86 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు వచ్చిందంటే ఈ ఏడాది దిగుబడి ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
మూతపడుతున్న జిన్నింగు మిల్లులు..
రాష్ట్రంలో 350 జిన్నింగు మిల్లులున్నా సరిగా పత్తి రాక.. 150 వరకూ మూతపడ్డాయి. మిగిలిన 200 మిల్లులూ కూడా తగినంతగా పంట రాక కేవలం 10శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రమేశ్ ‘ఈనాడు’కు చెప్పారు. పంట సరిగా రాక రైతులు, మిల్లులు సవ్యంగా నడపలేక తాము అప్పులు, నష్టాల్లో కూరుకుపోయినట్లు ఆయన వాపోయారు. పత్తి పంటకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధర బాగున్నా.. ఇంకా పెరుగుతుందేమోనన్న ఆశతో కొందరు రైతులు పంటను ఇళ్లలోనే దాచుకుంటున్నారని, దీనివల్ల కూడా మార్కెట్లు వెలవెలబోతున్నాయని ఆయన వివరించారు. ఇంకా పత్తిచేలలో దూది తీయాల్సి ఉందని, రానున్న రెండునెలలు కీలకమన్నారు. అరకోటి ఎకరాల్లో పత్తిపంట సాగయినా ఈ ఏడాది 30 లక్షల టన్నులకు మించి దిగుబడికి అవకాశం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎకరానికి 3 క్వింటాళ్లే దిగుబడి..
మాకున్న ఆరెకరాల పొలంలో ఈ ఏడాది పత్తి వేశా. ఎకరానికి రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టా. అధిక వర్షాలతో ఎకరానికి మూడు క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. గతేడాది ఎకరానికి పది క్వింటాళ్ల చొప్పున రాగా ఈసారి అందులో సగమైనా రాలేదు. క్వింటాలుకు రూ.8200 ధర పలికినా పెట్టుబడి అయినా తిరిగి రాలేదు.
- కాడే నారాయణ, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా
పెట్టుబడీ దక్కే అవకాశం లేదు
ఈ ఏడాది అప్పులు తెచ్చి ఐదెకరాల్లో పత్తి వేశా. ఇందులో రెండెకరాలు సొంతభూమి, మిగిలింది కౌలుకు తీసుకున్నా. ఎకరానికి రూ.10వేల చొప్పున కౌలుకే రూ.30వేలు కట్టా. ఎకరానికి రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టా. వర్షాలతో ఎకరానికి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. పెట్టుబడీ దక్కేటట్లు లేదు. పత్తికి ఇప్పుడు మార్కెట్‌లో ధర బాగున్నా.. నాలాంటి నష్టపోయిన రైతులకు ఒరిగిందేమీ లేదు.
- పోడేటి పరశురాంగౌడ్, వెదిర, కరీంనగర్ జిల్లా
ధర బాగున్నా.. చేతిలో పంట లేదు
నేను నాలుగెకరాల్లో పత్తి వేశా. రూ.లక్షకు పైగా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టా. గతంలో ఎకరాకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ సీజన్‌లో 5 క్వింటాళ్ల దిగుబడే రావటంతో తీవ్రంగా నష్టపోయా. మాకు గతంలో మంచి దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్‌లో సరైన ధర లేదు. ఇప్పుడు ధర బాగున్నా పంట రాక నష్టపోయా.
- జి.గంగుమల్లు, ఇబ్రహీంపూర్, మెదక్ జిల్లా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: లతాజీని కలిసి మాట్లాడలేకపోయా..!: విరాట్ కోహ్లీ
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Sports News
Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్ తర్వాత లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్న అజింక్య రహానె
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు