Telangana News: అవన్నీ భూదాన్‌ భూములే.. అక్రమార్కుల నుంచి 110 ఎకరాల స్వాధీనం

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ పరిధిలో అన్యాక్రాంతమైన వందెకరాలూ భూదాన్‌ భూములేనని రెవెన్యూ శాఖ నిర్ధారించింది.

Updated : 03 Dec 2022 08:41 IST

మేకలగట్టు భూదందాపై అధికారుల చర్యలు
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, వరంగల్‌, రఘునాథపల్లి, న్యూస్‌టుడే: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ పరిధిలో అన్యాక్రాంతమైన వందెకరాలూ భూదాన్‌ భూములేనని రెవెన్యూ శాఖ నిర్ధారించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘వందెకరాల పందేరం’, ‘అడుగడుగునా అక్రమాలే’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా ఆ శాఖ సర్వే చేసి 110 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకుంది.

మేకలగట్టులో సర్వే నంబరు 206లో భూదానోద్యమం కింద సేకరించిన భూములను అప్పట్లో దళితులకు ప్రభుత్వం ఇచ్చింది. వీటిపై రియల్‌ వ్యాపారుల కన్ను పడింది. రెండేళ్లుగా ఇక్కడ వెంచర్లు వేసి ఒక్కో స్థలాన్ని అమ్మేస్తూ వచ్చారు. ఈ అక్రమాలపై ‘ఈనాడు’ సమగ్ర కథనాలు ఇచ్చింది. దీంతో అనేక మంది ప్రజా సంఘాల నేతలు ఈ భూములను తిరిగి దళితులకే ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించడంతో పాటు, లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు భూదాన యజ్ఞ బోర్డుకు లేఖ రాసి, ఆయా భూములపై నివేదిక తీసుకున్నారు. వారు చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఎస్సీలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములను రియల్‌ ఎస్టేస్‌ వ్యాపారులు ఆక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా అతిథి గృహం నిర్మించడంతో పాటు స్థలాలను అమ్మేస్తున్నారని తేలడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ‘206 సర్వే నంబరులో 110 ఎకరాల భూమిని ఆధీనంలోకి తీసుకున్నామని, ఈ భూముల చుట్టూ ట్రెంచ్‌ కొట్టి ఎవరూ ఆక్రమించకుండా ముళ్ల కంచె వేశామని’ రఘునాథపల్లి తహసీల్దారు అన్వర్‌ తెలిపారు. రికార్డుల్లో ఉన్న మరో 10.3 ఎకరాలు క్షేత్ర స్థాయిలో కొలతల్లోకి రాలేదని వెల్లడించారు. ఈ భూములపై  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని... 60 ఎకరాల మేర మళ్లీ దళితులకే కేటాయించి.. మిగిలిన 50 ఎకరాలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించవచ్చని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని