Telangana News: అడవిలో అభిమన్యులు.. దాడులు జరిగితే అంతే!

ఒకవైపు అటవీ భూముల్ని ఆక్రమణల నుంచి కాపాడాలి. మరోవైపు అటవీ సంపదను కాపాడే క్రమంలో స్మగ్లర్ల దాడుల్ని ఎదుర్కోవాలి.

Updated : 03 Dec 2022 08:37 IST

బీట్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో 38 శాతం ఖాళీలు
ఒక్కో ఎఫ్‌బీఓకు రెండు మూడు బీట్ల బాధ్యతలు
ఆక్రమణదారులు, స్మగ్లర్లు, అగ్ని ప్రమాదాల రూపంలో ముప్పు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకవైపు అటవీ భూముల్ని ఆక్రమణల నుంచి కాపాడాలి. మరోవైపు అటవీ సంపదను కాపాడే క్రమంలో స్మగ్లర్ల దాడుల్ని ఎదుర్కోవాలి. వేటగాళ్ల నుంచి వన్యప్రాణుల్ని సంరక్షించాలి. రేయింబవళ్లు విధులు, అణుక్షణం అప్రమత్తం. అడవిలో అడుగుపెట్టాక ఎప్పుడు ఆపద ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. వాస్తవంగా అడవుల్లో క్షేత్రస్థాయిలో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొనేది బీట్‌ అధికారులే. ఇలాంటి కీలక విభాగంలో ఏకంగా 38 శాతం పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు దారుణ హత్య ఉదంతానికి ఇలాంటి పరిస్థితులే కారణమని ఆ శాఖ సిబ్బంది ఉదహరిస్తున్నారు.

ఒంటరి పోరాటం

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. అందులో అటవీ విస్తీర్ణం 26,903.70 చ.కి.మీ. అడవులను రక్షించేందుకు ఉన్న బీట్‌ అధికారుల పోస్టుల సంఖ్య కేవలం 3,647. ఇందులో 1,393 ఖాళీలు ఉన్నాయి. ఉన్న వాళ్లలో దాదాపు 15 శాతం మంది ఉన్నత ఉద్యోగాల శిక్షణ కోసం సెలవులో ఉన్నారు. ఈ విభాగంలో దాదాపు 42 శాతం మహిళా ఉద్యోగులే. దీంతో అరకొర సిబ్బందిపైనే అడవుల్ని కాపాడే భారం పడుతోంది. ఒక్కో అటవీ బీట్‌ విస్తీర్ణం 600-700 హెక్టార్లు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో బీట్‌ అధికారి రెండు, మూడు బీట్ల బాధ్యతలు చూడాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆక్రమణదారులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందని’ బీట్‌ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అడవుల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే సమయంలో దాడులు ఎదుర్కొంటున్నామని, సెక్షన్‌కు ఒకటి మాత్రమే మంటలను ఆర్పే బ్లోయర్లు ఉన్నాయని, వేసవిలో అడవి అంటుకుంటే అనేక చోట్ల చీపుర్లతోనే మంటలు ఆర్పాల్సి వస్తోందని’ కన్నీటిపర్యంతమవుతున్నారు.

దాడులు జరిగితే అంతే

ఎఫ్‌బీఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌ఆర్వోలకు ఆయుధాల్లేవు. చేతిలో కర్రలే వారి ఆత్మరక్షణకు ఆయుధాలు. ఇది కూడా స్మగ్లర్ల ఆగడాలకు కారణమవుతోందనే విమర్శలున్నాయి. ‘ఎఫ్‌ఆర్వో స్థాయి అధికారులకు వాహనాలిచ్చినా అవి కాలం చెల్లినవి. సాధారణ జీపులు కావడంతో ఎవరైనా దాడి చేస్తే తప్పించుకునే పరిస్థితి ఉండదు. గతంలో ఓ అటవీ అధికారిని జీపులో ఉండగానే చంపేశారు. పోలీసులకు మాదిరి అన్ని వైపులా డోర్లు, ఇనుపజాలీ వంటి రక్షణ ఏర్పాట్లతో కూడిన వాహనాలుండాలి. అటవీ ఉద్యోగులకు గతంలోమాదిరి ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయం వచ్చేలోగా ప్రతి అటవీ రేంజ్‌కు నలుగురు, ఐదుగురు పోలీసులను ఇవ్వాలి’ అని ఎఫ్‌ఆర్వోలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని