హైటెక్స్‌లో అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శన

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శన ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మార్ట్‌’ శుక్రవారం మొదలైంది.

Published : 03 Dec 2022 05:07 IST

ప్రారంభించిన టూరిజం ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శన ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మార్ట్‌’ శుక్రవారం మొదలైంది. దేశ, విదేశాల్లో పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన సమాచారంతో స్టాళ్లు కొలువుదీరాయి.  దేశీయ పర్యాటకాన్ని పెంచేందుకు బెంగళూరుకు చెందిన స్పియర్‌ ట్రావెల్‌ మీడియా ఎగ్జిబిషన్స్‌ ఏటా దీన్ని నిర్వహిస్తోంది. మలేసియా, దుబాయి, థాయ్‌లాండ్‌, మాల్దీవులు, మారిషస్‌, నేపాల్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, యూకే దేశాలకు చెందిన పలు ట్రావెల్‌ సంస్థలతోపాటు దేశంలోని 16 రాష్ట్రాలు పాల్గొన్న ఈ ప్రదర్శనను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ- పర్యాటకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఉన్న దార్శనికత తెలంగాణ బ్రాండ్‌గా మారి రాష్ట్రానికి దేశ, విదేశ పర్యాటకులు పెరుగుతున్నారన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌, రామప్ప వంటి చోట్ల ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలనేకం ఉన్నాయని వివరించారు. పర్యాటక అభివృద్ధికి చేస్తున్న కృషికి రాష్ట్రం ఇటీవల నాలుగు విభాగాల్లో జాతీయ పర్యాటక అవార్డులు గెలుచుకుందని గుర్తుచేశారు.

ఆపరేటర్ల మధ్య ఒప్పందాలు

సదస్సుల్లో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు రాష్ట్రానికి చెందిన వారితో పర్యాటక ఒప్పందాలు చేసుకున్నారు. కేరళ, కర్ణాటకతో పాటు గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థలు పోటాపోటీగా పెద్దపెద్ద స్టాళ్లు పెట్టి ఇతర రాష్ట్రాల ఏజెంట్లను పిలిచాయి. లక్షదీవులు, పాండిచ్చేరి పర్యాటక అభివృద్ధి సంస్థలు చురుగ్గా పాల్గొన్నాయి. అక్కడి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల ఓనర్లు, రిసార్టు ఓనర్లను రప్పించాయి. విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా మలేసియా టూరిజంతో కలిసి పాల్గొంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాత్రం ఇక్కడ స్టాల్‌ ఏర్పాటుచేయలేదు. ఏపీ నుంచీ రాలేదు. మరోవైపు తెలంగాణకు చెందిన ప్రైవేటు ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు మాత్రం పర్యాటక ప్రదర్శనలో పాల్గొని స్టాళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో స్కాల్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు శైలేష్‌ మాథూర్‌, టూరిజం కమిటీ ఛైర్మన్‌ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ) వాల్మీకి హరికిషన్‌, టాయ్‌ (ట్రావెల్‌ ఏజెన్సీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా- తెలంగా ఛాఫ్టర్‌) ఛైర్మన్‌ నాగేశ్‌ పంబాటి తదితరులు హాజరయ్యారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు