ఉన్నతి.. ద్విగుణీకృతం

ఉన్నత విద్యలో మొన్నటివరకు అబ్బాయిలదే హవా. తద్భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్నేళ్లుగా అబ్బాయిల సంఖ్యతో పోల్చితే అది రెండింతలు అవుతోంది

Published : 03 Dec 2022 05:07 IST

పీజీ కోర్సుల ప్రవేశాల్లో అమ్మాయిలదే హవా
కొన్నేళ్లుగా అబ్బాయిలతో పోల్చితే గణనీయ వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో మొన్నటివరకు అబ్బాయిలదే హవా. తద్భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్నేళ్లుగా అబ్బాయిల సంఖ్యతో పోల్చితే అది రెండింతలు అవుతోంది.

ఎందుకీ పరిస్థితి: తాజాగా 2022-23 సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ముగిశాయి. 16,720 మంది అమ్మాయిలు వాటిలో చేరితే.. అబ్బాయిల పరంగా ఆ సంఖ్య 6,418 మాత్రమే. అబ్బాయిలు యూజీ స్థాయిలోనే చదువు ముగించి వ్యాపార, ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. డిగ్రీ స్థాయిలో ఉత్తీర్ణత శాతంలోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. అయితే..పెరుగుతున్న విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా వసతి కల్పించడం వర్సిటీలకు కత్తిమీద సాముగా మారింది. ఓయూలో 3వేల మంది విద్యార్థినులకు హాస్టల్‌ సౌకర్యం అందుబాటులో ఉండగా.. 6,500 మంది దానికోసం ఎదురుచూస్తున్నారు.

అవగాహన పెరిగింది
- ఐ.పాండురంగారెడ్డి, సీపీగెట్‌ కన్వీనర్‌

పీజీ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య పెరగడానికి మూలకారణం సామాజికంగా వచ్చిన మార్పులే. అబ్బాయిలతో సమానంగా వారినీ చదివించాలనే అవగాహన తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అమ్మాయిలు పైచదువులు చదువుకుంటే ఉద్యోగాల్లో స్థిరపడి ఆర్థిక సాధికారిత సాధిస్తున్నారు.

దన్నుగా ప్రభుత్వ విధానాలు
- ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బాలికల రెసిడెన్షియల్‌ కళాశాలల ఏర్పాటుతో పాటు 67 ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. కల్యాణలక్ష్మి వంటి పథకాలతో బాల్య వివాహాలకు చెక్‌ పడింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని