పరిచయం.. ప్రమాదమై..!

హైదరాబాద్‌ తుర్కయాంజాల్‌కు చెందిన ఓ విద్యార్థి (25)కి తెలుగు డేటింగ్‌యాప్‌ ద్వారా ఓ యువతి పరిచయం అయింది.

Updated : 03 Dec 2022 09:17 IST

డేటింగ్‌ యాప్‌ల మాటున దారుణాలు
మాయమాటలతో దోపిడీ, అరాచకాలు
నేరగాళ్ల ‘సాంకేతిక దందా’
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ తుర్కయాంజాల్‌కు చెందిన ఓ విద్యార్థి (25)కి తెలుగు డేటింగ్‌యాప్‌ ద్వారా ఓ యువతి పరిచయం అయింది. ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఓ రోజు వీడియోకాల్‌ చేసిన ఆమె దుస్తుల్లేకుండా కనిపిస్తూ.. యువకుడిని కూడా అలా చేయమని ప్రేరేపించి మొత్తం రికార్డు చేసింది. తర్వాత ఈ వీడియోను అందరికీ పంపుతానని బెదిరిస్తూ దఫదఫాలుగా ఆమె రూ.98,400 వసూలు చేసింది. బెదిరింపులు  ఆగకపోవడంతో ఆ యువకుడు రాచకొండ సైబర్‌   పోలీసులను ఆశ్రయించాడు.


పద్మారావునగర్‌కు చెందిన ఓ 60ఏళ్ల వ్యక్తి కూడా ఇదేరీతిలో రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. డేటింగ్‌యాప్‌లో పరిచయమైన యువతితో అసభ్యకర సంభాషణ చేశాడు. దాన్నంతా రికార్డు చేసిన ఆమె అడిగినంతా ఇవ్వకపోతే ఆ సంభాషణలన్నీ సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. డేటింగ్‌యాప్‌ల  ‘ఆకర్షణ’లో పడి ఇలా మోసపోతున్న ఉదంతాలు రాష్ట్రంలో పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి.

ఒక ఆకర్షించే ఫొటో.. నాలుగు ఆకట్టుకునే మాటలు.. నిలువునా ముంచేస్తున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా డబ్బులు దోచేయడమే కాకుండా.. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. ఎదుటివారి బలహీనతలను ఆసరాగా చేసుకుని డేటింగ్‌యాప్‌ల మాటున సాగుతున్న ఈ సాంకేతిక దందా ఇప్పుడు తీవ్ర ‘సామాజిక’సమస్యగా మారింది. స్నేహం ముసుగులో పుట్టుకొస్తున్న డేటింగ్‌యాప్‌లు యువతకే కాదు.. వయసుమళ్లిన వారినీ ప్రమాదంలో పడవేస్తున్నాయి. దిల్లీలో.. ఇదే తరహా యాప్‌ ద్వారా పరిచయం అయిన శ్రద్ధావాకర్‌ అనే యువతిని హత్యచేసి, ముక్కలుగా కోసిన అఫ్తాబ్‌ ఉదంతం ఇప్పడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

స్నేహం ముసుగులో మోసం!

ఒకప్పుడు కలంస్నేహం పేరుతో పరిచయం లేనివారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. తమ అలవాట్లు, అభిరుచులు పంచుకునేవారు. కాలక్రమంలో అది మరుగున పడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మళ్లీ ఈతరహా స్నేహాలు మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త వ్యక్తుల మధ్య పరిచయం ఏర్పడుతోంది. ఇది ఇంకాస్త ముందుకు వెళ్లి డేటింగ్‌యాప్‌లకు దారితీసింది. వీటిలో ఎవరైనా సభ్యత్వం పొందవచ్చు. తమ వయసు, ఆదాయం, అభిరుచులు, అలవాట్లు వంటివి నమోదు చేయగానే ప్రొఫైల్‌ సిద్ధమవుతుంది. అప్పటికే ఆ యాప్‌లో నమోదయిన వారికి ఈ వివరాలన్నీ కనిపిస్తాయి. వీటిని ఇష్టపడినవారు వ్యక్తిగతంగా యాప్‌ ద్వారానే సందేశం ఇవ్వవచ్చు. ఇద్దరూ స్నేహం చేసుకునేందుకు ఇష్టపడే పక్షంలో చాటింగ్‌ చేసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవడం, తర్వాత వ్యక్తిగతంగా కలుసుకోవడం చేయవచ్చు. స్థూలంగా డేటింగ్‌యాప్‌ల పనితీరు ఇదే. కొత్త వ్యక్తులతో పరిచయం అనే ఆలోచనే చాలామందిలో ఆసక్తి రేపుతుంది. యువతీ యువకులు పరస్పరం స్నేహం చేయడానికి వీటిని ఆశ్రయిస్తున్నారు. వీటిద్వారా జరిగే నిజమైన స్నేహాలు పదులసంఖ్యలో కూడా ఉండవు. ఎదుటివారిలో ఉండే ఆసక్తిని ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మారుపేర్లు, తప్పుడు ఫొటోలు పెట్టి బోల్తా కొట్టిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ పరిచయం దోపిడీ, అత్యాచారం, హత్యల వరకూ వెళుతోంది. కేవలం ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకే రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, దిల్లీ వంటిచోట్ల వందల సంఖ్యలో ముఠాలు పనిచేస్తున్నాయంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

అప్రమత్తతే మందు..

* డేటింగ్‌యాప్‌లలో 90 శాతానికి పైగా తప్పుడు సమాచారమే ఉంటుంది. ఆకర్షణీయమైన ఫొటోలు, రూ.లక్షల్లో జీతం, ఒంటరి జీవితం అంటూ ఎదుటివారిని ఆకర్షించే ప్రొఫైల్స్‌ కుప్పలుతెప్పలు. ఒకసారి పరిచయం కాగానే తీయటి మాటలతో బోల్తా కొట్టిస్తారు. చాటింగ్‌ చేయకుండా ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. అసలు ఇలాంటి పరిచయాలకు దూరంగా ఉండటమే మంచిది.

* ఒకవేళ పరిచయం అయినా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దు. వెళ్లాల్సివచ్చినా ఎవర్ని కలవడానికి, ఎక్కడికి వెళుతున్నారో స్నేహితులు బంధువులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.

* అసభ్యకర సంభాషణలు మొదలుపెట్టి నగ్నంగా వీడియోచాట్‌ చేసేలా ఎవరైనా ప్రేరేపిస్తుంటే అలాంటి మాయలో పడొద్దు.

* కొందరు తమకు బాగా డబ్బుందని తొలుత ప్రచారం చేసుకుంటారు. ఆ తర్వాత అనుకోకుండా కొంత నగదు అవసరం పడిందని, సర్దుబాటు చేయమంటారు. ఖరీదైన బహుమతులు పంపుతామని, కస్టమ్స్‌ సుంకం చెల్లించమని.. ఇలా మోసం చేస్తుంటారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానం వస్తే ఇలాంటివాటిపై సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేయవచ్చు.


మోసాలే ఎక్కువ..

డేటింగ్‌యాప్‌ల జోలికి పోకపోవడం ఉత్తమం. చాలామంది నేరగాళ్లు ఎక్కడెక్కడి నుంచో ఫోటోలు సేకరించి వీటిలో పెడుతున్నారు. ఇక్కడ ఇచ్చే నంబర్లన్నీ నేరగాళ్ల ముఠాకు చెందినవే. ఇందుకోసం ఒక కాల్‌సెంటర్‌ను కూడా పెట్టుకుంటున్నారు. డేటింగ్‌యాప్‌లో ఎవరు ఎవరికి ఫోన్‌ చేసినా అవన్నీ కాల్‌సెంటర్‌కే పోతుంటాయి. మాయమాటలతో మోసం చేయడంలో ఆరితేరినవారు తీయగా మాట్లాడి నిలువునా ముంచేస్తున్నారు. ‘మగ వ్యభిచారులు కావాలి’ అంటూ వచ్చే ప్రకటనలన్నీ మోసపూరితమైనవే. యాప్‌లో ఉన్న ఫొటో, దాని కిందున్న వివరాలు చూసి మోసపోవద్దు. వీటివెనుక నేరగాళ్లు ఉంటారన్న విషయం మరువొద్దు. సైబర్‌ నేరాలకు సంబంధించి మాకు వస్తున్న ఫిర్యాదుల్లో ఒకప్పుడు ఇలాంటివి ఒకటి రెండు మాత్రమే ఉండేవి. క్రమంగా వీటి సంఖ్య భారీగా పెరుగుతోంది.

- కేవీఎన్‌ ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్‌, హైదరాబాద్‌


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు