గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్లు

రాష్ట్రంలోని మహిళలకు రక్తహీనత శాపంగా మారింది. తల్లితో పాటు బిడ్డ అనారోగ్యానికి, ప్రసూతి మరణాలకూ ఇదే ప్రధాన కారణమవుతోంది.

Updated : 04 Dec 2022 05:24 IST

తొమ్మిది జిల్లాల్లో పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రక్తహీనత, గర్భస్రావాలు, ప్రసూతి మరణాలు తగ్గించేందుకే
వచ్చే వారమే కొత్త పథకం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళలకు రక్తహీనత శాపంగా మారింది. తల్లితో పాటు బిడ్డ అనారోగ్యానికి, ప్రసూతి మరణాలకూ ఇదే ప్రధాన కారణమవుతోంది. గర్భస్రావం, నెలలు నిండకుండానే లేదా తక్కువ బరువుతో శిశువులు పుట్టడం వంటి సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. పౌష్టికాహారం అందకపోవడం వల్లే ఇలా జరుగుతోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. తొమ్మిది జిల్లాల్లో 1.24 లక్షల మంది తీవ్ర రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారని సర్వేలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా పౌష్టికాహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రూ.50 కోట్లతో 2,49,552 పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయనున్నారు. 5వ నెలలో ఒకసారి, 9వ నెలలో మరోసారి ఇస్తారు. 201 ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. మొదటి కిట్‌ విలువ రూ.1,962, రెండో కిట్‌ విలువ రూ. 1,818 ఉంటుంది. ఈ పథకం వచ్చే వారం ప్రారంభం కానుంది.

మారుమూల, గిరిజన జిల్లాల్లో..

ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్ధారించింది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు కడుపులో బిడ్డ ఎదిగే క్రమంలో తల్లికి పౌష్టికాహారం ముఖ్యం. కానీ, గిరిజన, మారుమూల జిల్లాల్లోని గర్భిణులకు పౌష్టికాహారం లభించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం, అవగాహన రాహిత్యం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావమైనప్పుడు రక్తహీనత ప్రాణాంతకంగా మారుతోంది. బాలింతల మరణాలకు 70 శాతం ఇదే కారణం. నాడీ సంబంధిత సమస్యలతో పాటు తక్కువ బరువుతో, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, మృతశిశువులు జన్మించడం వంటి వాటికి దారితీస్తోంది. ఐరన్‌తో పాటు విటమిన్‌ బీ12, ఫోలేట్‌, ఏ విటమిన్‌ లోపాల సమస్య తీవ్రతరమవుతోంది.

గర్భిణులకు ప్రభుత్వ అండ: మంత్రి హరీశ్‌రావు

మహిళల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. కేసీఆర్‌ కిట్‌ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడంతో ఇదే స్ఫూర్తితో పౌష్టికాహార కిట్‌ తెస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇది మరో ముందడుగు. ఈ పథకం గర్భిణులకు వరం లాంటిది. వారిలో పౌష్టికాహార లోపాలను తగ్గించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇది దోహదపడుతుంది. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన కిట్లు ఎంతో ఉపయోగపడతాయి. వీటితో పోషకాహార లోపం నివారణే కాకుండా సిజేరియన్లు తగ్గుతాయి. మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్‌.. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ అందిస్తూ గర్భిణులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని