చేష్టలుడిగి చూస్తున్న హెచ్‌ఎండీఏ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌ గ్రామంలోని సర్వే నెం.227, 230ల్లో రాంకీతో 2008లో కుదుర్చుకున్న ఒప్పందంలో హెచ్‌ఎండీఏ చేష్టలుడిగి ఉండిపోయిందని హైకోర్టు తప్పుబట్టింది.

Published : 04 Dec 2022 04:55 IST

 రాంకీతో ఒప్పందం అమలులో వైఫల్యం
హెచ్‌ఎండీఏ తీరును తప్పుబట్టిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌ గ్రామంలోని సర్వే నెం.227, 230ల్లో రాంకీతో 2008లో కుదుర్చుకున్న ఒప్పందంలో హెచ్‌ఎండీఏ చేష్టలుడిగి ఉండిపోయిందని హైకోర్టు తప్పుబట్టింది. రూ.75కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దు నోటీసు ఇచ్చి చర్యలు చేపట్టలేదని, నోటీసును సవాలు చేస్తూ రాంకీ కోర్టును ఆశ్రయించినపుడు కూడా హెచ్‌ఎండీఏ చేపట్టిన ఆర్బిట్రేషన్‌, చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదంది. హెచ్‌ఎండీఏ లేఖ ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్‌ విల్లాలు, ఫ్లాట్‌ల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడం చెల్లదని పేర్కొంది. శ్రీనగర్‌లో రాంకీ, హెచ్‌ఎండీఏలు చేపట్టిన గార్డీనియా గ్రోవ్‌ విల్లా, గ్రీన్‌ వ్యూ అపార్ట్‌మెంట్స్‌, హడిల్‌, గోల్డెన్‌ సర్కిల్‌ విల్లాలు, ఫ్లాట్‌లను ‘భూమి నిషేధిత జాబితాలో ఉంద’ంటూ సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రాంకీ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ లిమిటెడ్‌ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ ఎలాంటి కారణం లేకుండా నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదన్నారు. హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అభివృద్ధి ఒప్పందంలో భాగంగా రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.25 కోట్లే చెల్లించిందన్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రైవేటు, ప్రభుత్వ వివాదంలో ఉన్న భూమికి సంబంధించి హెచ్‌ఎండీఏ లేఖ ఆధారంగా 22(1)(ఎ)(ఇ) కింద నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. 750 ఎకరాల్లోని ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ ప్రాజెక్టులో 374 ఎకరాల అభివృద్ధికి ఒప్పందం కుదిరిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి అభివృద్ధి ఒప్పందంలోని షరతులు ఉల్లంఘించినపుడు చట్టప్రకారం చర్యలను హెచ్‌ఎండీఏ చేపట్టినట్లు రికార్డులు లేవన్నారు. కక్షిదారులు చట్టప్రకారం చర్యలు ప్రారంభించి తరువాత కోర్టుల నుంచి రక్షణ కోరడానికి అవకాశం ఉంటుందని, ఇక్కడ కోర్టులే రక్షణ కల్పించాలన్నట్లు హెచ్‌ఎండీఏ చెప్పడం సరికాదన్నారు. రిజిస్ట్రేషన్‌లను నిలిపివేస్తూ 22(1)(ఎ) కింద నిషేధిత జాబితాలో ఉంచడానికి ఇక్కడ చట్టప్రకారం కారణాలు లేవన్నారు.హెచ్‌ఎండీఏ లేఖ ఆధారంగా నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదన్నారు. రాంకీ పిటిషన్‌ను అనుమతిస్తూ కేవలం హెచ్‌ఎండీఏ లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్‌లను నిరాకరించరాదని సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. రాంకీని అడ్డుకోవాలంటూ రైతులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌లను కొట్టివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని