అదనంగా కొన్న ధాన్యం 12 లక్షల టన్నులు

‘ప్రస్తుత వానాకాల సీజనులో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే వారం నుంచి మరింత వేగం పుంజుకుంటాయి.

Published : 04 Dec 2022 04:55 IST

రైతులకు రూ.4,780 కోట్లు చెల్లించాం
అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు
ధాన్యం సేకరణపై మంత్రి గంగుల సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ‘ప్రస్తుత వానాకాల సీజనులో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే వారం నుంచి మరింత వేగం పుంజుకుంటాయి. వరి కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు రూ.38.06లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. గత సీజనులో ఇదే సమయంతో పోలిస్తే 12.22 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొన్నాం’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. వరి కోతలు ముమ్మరమవుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ తీరుతెన్నులపై ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ‘గడచిన సీజనులో ఇదే కాలానికి 25.84 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశాం. ఈసారి ఆ మొత్తం భారీగా పెరిగింది. 6,734 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశాం. అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చాం. కొన్ని ప్రాంతాల్లో కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ సొమ్ము రైతులకు అందుతుండటం సంతోషకరం. కొన్న ధాన్యంలో సుమారు 95 శాతాన్ని మిల్లులకు తరలించాం. ఇప్పటి వరకు 6.42 లక్షల మంది రైతుల నుంచి కొన్న ధాన్యం ఖరీదు రూ.7,837 కోట్లు కాగా రూ.4,780 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మిగిలిందీ ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాటు చేశాం. భారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినా సేకరణలో ఇబ్బందులు లేకుండా గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు, తేమను కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి’ అని మంత్రి కమలాకర్‌ చెప్పారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌, సహాయ కమిషనర్‌ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని