సిట్‌ నోటీసును కొట్టేయండి

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో భాగంగా తనపై సిట్‌ జారీ చేసిన సీఆర్‌పీసీ41ఏ నోటీసును కొట్టివేయాలని కేరళకు చెందిన జగ్గు కొట్టిలిల్‌ అలియాస్‌ డా.జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 04 Dec 2022 04:55 IST

హైకోర్టులో కేరళకు చెందిన జగ్గుస్వామి పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో భాగంగా తనపై సిట్‌ జారీ చేసిన సీఆర్‌పీసీ41ఏ నోటీసును కొట్టివేయాలని కేరళకు చెందిన జగ్గు కొట్టిలిల్‌ అలియాస్‌ డా.జగ్గుస్వామి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై సిట్‌ జారీ చేసిన లుకౌట్‌ నోటీసునూ కొట్టివేయాలని కోరారు. భాజపా, తెరాసల మధ్య పోరులో భాగంగా ఈ కేసు చోటుచేసుకుందన్నారు. ‘‘టెర్రరిస్టును పట్టుకోవడానికి అన్నట్లుగా సిట్‌అధికారులు కేరళ వచ్చారు. కొచిలో నా ఆచూకీ కోసం ప్రయత్నించారు. నేను పనిచేస్తున్న అమృత వైద్యకళాశాలకు వెళ్లి సెక్యూరిటీతో పాటు ఉద్యోగులను అడిగారు. నవంబరు 21న హాజరుకావాలని నోటీసు ఇచ్చినవారు ఆ తేదీ వరకు కూడా ఆగకుండా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. ఇందులో భాగంగా నా సోదరుడిని కేరళలో ఏర్పాటు చేసుకున్న సిట్‌ కార్యాలయానికి పిలిపించారు. అతనికి నోటీసులు ఇవ్వడంతోపాటు భయభ్రాంతులకు గురిచేశారు. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. నోటీసు జారీకి కారణాలను పేర్కొనలేదు. నిందితులకే ఈ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేయవచ్చు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ద్వారా విచారణకు హాజరైతే అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేవరకూ తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని