కంటి వెలుగు పథకాన్ని విజయవంతం చేయాలి: కేసీఆర్‌

కంటి వెలుగు పథకాన్ని తమాషా కోసమో.. రాజకీయాల కోసమో తీసుకురాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే రెండో దశ ప్రారంభిస్తున్నామని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు.

Updated : 05 Dec 2022 07:03 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: కంటి వెలుగు పథకాన్ని తమాషా కోసమో.. రాజకీయాల కోసమో తీసుకురాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే రెండో దశ ప్రారంభిస్తున్నామని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసరి వినియోగంలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సంక్షేమ పథకాల్లో ఏ రాష్ట్రం కూడా మనకు పోటీగా లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో ఇది సాధ్యమైందని తెలిపారు. పీవీ నరసింహారావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్‌ గురుకులాన్ని ఏర్పాటు చేశారని.. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన కాదని.. పేదింటి ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చామని వివరించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేయాలన్నారు.

బీజేవైఎం నేతల నినాదాలు

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు రోడ్డుమార్గంలో వచ్చారు. జడ్చర్ల వద్ద కేసీఆర్‌ కాన్వాయ్‌ వస్తుండగా బీజేవైఎం నేతలు రోడ్డు పక్కన నిలబడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్‌ పద్మావతి కాలనీ వద్ద రోడ్డు పక్కన నిలబడి సీఎం గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. మహబూబ్నగర్‌ సభకు హాజరైన కొందరు ముస్లిం యువత 900 ఉర్దూ పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని, ఉర్దూను రాష్ట్రంలో రెండో అధికార భాషగా అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు