పాత స్థలాలకు కొత్త సర్వే నంబర్లు!

పోలీస్‌శాఖలో అతడో సాధారణ కానిస్టేబుల్‌.. కానీ చేసేది మాత్రం భూదందాలు.. తాజాగా రెండు కేసుల్లో అభియోగపత్రాలు నమోదు కావడంతో అతడి నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 05 Dec 2022 05:39 IST

భూములను కొట్టేసేందుకు బైనంబర్ల పేరిట దందా
కానిస్టేబుల్‌ నేతృత్వంలో ‘రియల్‌’ ఆగడాలు
డీజీపీకి బాధితుల మొర.. విచారణకు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో అతడో సాధారణ కానిస్టేబుల్‌.. కానీ చేసేది మాత్రం భూదందాలు.. తాజాగా రెండు కేసుల్లో అభియోగపత్రాలు నమోదు కావడంతో అతడి నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లో న్యూగ్రీన్‌సిటీ కాలనీ కేంద్రంగా కానిస్టేబుల్‌ భాస్కర్‌రావు బృందం సాగించిన భూబాగోతమిది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న అతడు కాలనీలోని 529, 530 సర్వే నంబర్లలో సాగించిన బైనంబర్ల దందా పోలీసుల తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం లేఅవుట్‌ వేసి విక్రయించిన ప్లాట్లపై వివాదాలు సృష్టించి కొట్టేసే కుయుక్తులకు ఇతడి బృందం తెరలేపింది. వాస్తవానికి కాలనీ లేఅవుట్‌లో ఖాళీ స్థలమేదీ లేకపోయినా భాస్కర్‌రావు బృందం మాత్రం రిజిస్ట్రేషన్లకు తెర లేపడం గమనార్హం. 2018లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. బైనంబర్లు వేసి భాస్కర్‌రావు సొంతంగా ఓ ప్లాటును రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా.. మరికొన్ని ప్లాట్లను అనుచరుల పేరుతో చేయించినట్లు ఆరోపణలున్నాయి. అప్పటికే ఆయా ప్లాట్లలో యజమానులు ప్రహరీల్లాంటి నిర్మాణాలతో పొజిషన్‌లోనే ఉన్నా సరే భాస్కర్‌రావు బృందం ఈ దందాకు పాల్పడింది. అనంతరం తాపీగా న్యాయస్థానం నుంచి నోటీస్‌ పంపించాకే అసలు యజమానులకు భాస్కర్‌రావు నిర్వాకం అవగతమైంది. బాధితులు రాజేంద్రనగర్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తుక్రమంలో మోసాలు బహిర్గతమై అభియోగపత్రాలు నమోదవుతున్నాయి. ముఠా ఆగడాలు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాధితులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి మొర పెట్టుకోవడంతో విచారణకు ఆదేశించారు.

1997లో రిజిస్ట్రేషన్‌.. 2018లో కోర్టు నోటీస్‌

న్యూగ్రీన్‌సిటీ కాలనీ 529 సర్వేనంబరులో ఎర్రం రామకృష్ణారెడ్డి తన భార్య భారతి పేరిట 1997లో రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ ద్వారా 200 చదరపు గజాల స్థలం కొన్నారు. ఆ స్థలానికి 2008లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసి రుసుం చెల్లించారు. 2009లో జీహెచ్‌ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి పొంది ప్రహరీ నిర్మించుకున్నారు. భాస్కర్‌రావు 2018లో భారతికి కోర్టు నోటీస్‌ పంపారు. ఆ ప్లాట్‌ను తాను కొనుగోలు చేశానని.. రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఆ స్థలానికి బోర్డు పెట్టేందుకు ప్రయత్నించడంతో రామకృష్ణారెడ్డి రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు క్రమంలో భాస్కర్‌రావు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లుగా తేలడంతో ఇటీవలే అభియోగపత్రం దాఖలు చేశారు.

529లో అసలు రిజిస్ట్రేషన్‌.. 529/ఎతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌

ఇదే కాలనీలో 529 సర్వే నంబరులో 380 నంబరు గల 200 చదరపు గజాల ప్లాట్‌ను డి.ఆనంద్‌ కుటుంబీకులు 1992లో కొనుగోలు చేసి పొజిషన్‌లో ఉన్నారు. 2018లో నర్సింహదాస్‌ కోర్టు నోటీస్‌ పంపారు. అదే 380 నంబరు ప్లాట్‌ను తాను కొనుగోలు చేశాననేది నోటీస్‌ సారాంశం. అయితే ఆ సర్వేనంబరు 529/ఎ, 529/ఎఎగా ఉండటంతో ఆనంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుపుతుండగానే నర్సింహదాస్‌తోపాటు కానిస్టేబుల్‌ భాస్కర్‌రావు బృందం ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసులు నర్సింహదాస్‌ నకిలీ సర్వే నంబరుతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు గుర్తించి అభియోగపత్రం దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని