పశుసంవర్ధక శాఖలో గోల్‌మాల్‌

పశుసంవర్ధక శాఖకు చెందిన నిధుల వ్యయంలో గోల్‌మాల్‌ జరిగింది. పశు సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధులను నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారీతిగా వాడేసుకున్నారు.

Published : 05 Dec 2022 04:24 IST

కరవు భత్యం ఇచ్చేందుకు   లంచం వసూలు
టీకాల నిధులు మళ్లించారు
సంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి, మరో ఇద్దరిపై నేటి నుంచి విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: పశుసంవర్ధక శాఖకు చెందిన నిధుల వ్యయంలో గోల్‌మాల్‌ జరిగింది. పశు సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన నిధులను నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారీతిగా వాడేసుకున్నారు. ఈ శాఖకు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులే చాలా పరిమితంగా ఉంటున్నాయి. వాటినీ సక్రమంగా ఖర్చుపెట్టకుండా క్షేత్రస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి(డీవీఓ) డాక్టర్‌ ఎం.వసంతకుమారి, ఆత్మకూరుకు చెందిన పశువైద్యాధికారి సంతోష్‌కుమార్‌గౌడ్‌, కంది గ్రామ పశువైద్యాధికారి ఇర్ఫానుద్దీన్‌ సిద్ధిఖీ అవినీతికి పాల్పడ్డట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో శాఖాపరమైన విచారణకు  ప్రభుత్వం ఆదేశించింది. పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడి (జేడీ) స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 5, 6 తేదీల్లో సంగారెడ్డిలో నిందితులపై విచారణ జరగనుంది. వివరాల ప్రకారం.. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలను వేయాలని ప్రభుత్వం నిధులిస్తే వాటిని నిందితులు ఖజానా నుంచి డ్రా చేసి వేరే బ్యాంకు ఖాతాకు మళ్లించారు. గత ఆగస్టులో క్షేత్రస్థాయి ఉద్యోగులకు కరవు భత్యం కింద రూ.3300 చొప్పున ఇచ్చి అందులో నుంచి రూ.500 చొప్పున లంచంగా వసూలుచేశారు. ఈ సొమ్మును గూగుల్‌ పే ద్వారా వసూలు చేసినట్లు ఆధారాలున్నాయి. పశువుల వైద్యానికి వాడే మందులను సరఫరా చేసే కంపెనీల వారికి సైతం సరైన అనుమతులు లేకుండా నిధులు ఎలా చెల్లించారనే తేలాల్సి ఉంది. వాహనాల వినియోగం, మరమ్మతుల్లో సైతం నిధుల గోల్‌మాల్‌ జరిగింది. వీటికి తప్పుడు బిల్లులు పెట్టారని ఆధారాలున్నాయి. ఇద్దరు పశువైద్యులను, మరో ఇద్దరు జూనియర్‌ వెటర్నరీ అధికారులను, ఇద్దరు అటెండర్లను ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించుకున్నారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా పలు ఆరోపణలపై ఫిర్యాదులు అందినందున విచారణకు రాష్ట్రస్థాయి జేడీని పంపుతున్నామని చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు విచారణలో నిర్ధరణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించుకున్న ఉద్యోగులను తక్షణం వారి పోస్టింగ్‌ ఉన్న స్థలాలకు పంపాలని జిల్లా పశువైద్యాధికారిని శనివారమే ఆదేశించానని, వారు వెంటనే వెనక్కి వెళతారని ఆయన వివరించారు. అవినీతి వ్యవహారంలో పశువైద్యులకు నేరుగా ప్రమేయముందా లేక బయటి వ్యక్తుల ప్రమేయంతో జరిగిందా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని