ఆకాశ్‌ క్షిపణికి భారీ ఆర్డర్లు!

పెద్దఎత్తున ఆకాశ్‌ క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) క్షిపణికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, డ్రాయింగ్స్‌, ఇతర సమాచారాన్ని మిసైల్‌ సిస్టమ్స్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ ఏజెన్సీకి బదలాయించింది.

Published : 05 Dec 2022 04:24 IST

బల్క్‌ ఉత్పత్తికి సాంకేతికత, డ్రాయింగ్స్‌ను ఏజెన్సీకి బదలాయించిన డీఆర్‌డీవో

ఈనాడు, హైదరాబాద్‌: పెద్దఎత్తున ఆకాశ్‌ క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) క్షిపణికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, డ్రాయింగ్స్‌, ఇతర సమాచారాన్ని మిసైల్‌ సిస్టమ్స్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ ఏజెన్సీకి బదలాయించింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబరేటరీ(డీఆర్‌డీఎల్‌)లో శనివారం జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌, డైరెక్టర్‌ జనరల్‌ (మిసైల్స్‌, వ్యూహత్మక వ్యవస్థలు) నారాయణమూర్తి, డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌ జి.ఏ.శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా సాంకేతికతను ఏజెన్సీకి అందజేశారు. భారత సైన్యం కోసం ఆకాశ్‌ క్షిపణులను డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. డీఆర్‌డీఎల్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మొట్టమొదటి స్వదేశీ అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఆకాశ్‌. భారత సైన్యం అమ్ములపొదిలో చేరి దశాబ్దకాలంగా భారత గగనతల రక్షణ వ్యవస్థలో కీలకంగా మారింది. దీనికి భారత సైన్యం, వాయుసేన నుంచి రూ.30 వేల కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. స్వదేశీ క్షిపణి వ్యవస్థ కోసం ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఆర్డర్‌ కావడం విశేషం. తాజాగా సాంకేతికత బదలాయింపుతో పెద్దసంఖ్యలో ఉత్పత్తికి అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌, బీడీఎల్‌తో పాటు పలు మరిన్ని సంస్థలు క్షిపణి అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. ఆకాశ్‌ క్షిపణికి సంబంధించి అథారిటీ హోల్డింగ్‌ సీల్డ్‌ పర్టిక్యులర్స్‌ (ఏహెచ్‌ఎస్‌పీ)ను భారత సైన్యానికి బదిలీ చేయడాన్ని కీలక మైలురాయిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని