చదువుల తల్లికి.. దక్కింది భరోసా!

ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న స్రవంతికి దాతల అండ దొరికింది.

Published : 06 Dec 2022 04:52 IST

ఈనాడు, సిద్దిపేట: ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న స్రవంతికి దాతల అండ దొరికింది. తామున్నామంటూ పలువురు ముందుకొచ్చారు. నాలుగేళ్ల బీఎస్సీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసేందుకు తమవంతు సహకారమందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు రూ.1,62,000 నగదు సాయం అందించారు. దీంతో సోమవారం శ్రీ కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు స్రవంతి హాజరైంది. రాష్ట్రస్థాయిలో మూడోర్యాంకు రావడంతో ఆమెకు రాజేంద్రనగర్‌ ఉద్యాన కళాశాలలో సీటు లభించింది. మెరుగైన ప్రతిభ చూపినా గొర్రెల కాపరిగా మారాల్సిన స్రవంతి దయనీయ పరిస్థితిని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. ‘తల్లడిల్లుతోంది.. చదువుల తల్లి’ శీర్షికన ఇచ్చిన కథనానికి దాతలు స్పందించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లిలోని స్రవంతి ఇంటికి వెళ్లారు. తక్షణ సాయంగా రూ.50 వేలు అందించారు. భవిష్యత్తులోనూ విద్యకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్రవంతి సోదరి కళ్యాణి డిప్లొమాతో చదువు ఆపేసిందని తెలుసుకున్నారు. ఆమెకూ తగిన ఉద్యోగమిప్పిస్తానని భరోసానిచ్చారు. ఏస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి వైవీ గోపాలక్రిష్ణమూర్తి విశ్వవిద్యాలయ రుసుం రూ.47,090ను నేరుగా బ్యాంకులో చెల్లించి ఆమెకు కౌన్సెలింగ్‌లో సీటు దక్కేలా చూశారు. స్రవంతి బాగా చదువుకుంటే భవిష్యత్తులోనూ అండగా ఉంటామన్నారు. లీల రూ.30 వేలు, ఎస్సైలు చంద్రశేఖర్‌, చైతన్యరెడ్డి చెరో రూ.10 వేలు, శివ రూ.10 వేలు అందించారు. మరికొందరు చిన్నమొత్తాలను ఖాతాలో జమచేశారు. కథనం ప్రచురితమైన రోజే అరుణ్‌నాయక్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అమ్మాయికి అండగా ఉంటామంటూ ఆయన రీట్వీట్‌ చేశారు. సిద్దిపేట జిల్లా సంక్షేమ శాఖ అధికారులు స్రవంతి ఇంటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించుకున్నారు.


ఆ వృద్ధురాలి మోములో ఆనందం

‘ఆస్తి తీసుకుని అమ్మను వదిలేసింది’ శీర్షికన నవంబరు 3న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌ బస్సు షెల్టరులో తలదాచుకుంటున్న మార్త అనే వృద్ధురాలి గురించి నాడు వచ్చిన కథనానికి కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌, పలువురు దాతలు స్పందించారు. కొందరు నగదు రూపంలో, మరికొందరు వస్తు రూపంలో సహాయం చేయగా ఏసీపీ పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం చేపట్టారు. వంటగది, స్నానపుగది, మరుగుదొడ్డి, ఫ్యాన్లు, ఇలా అన్ని వసతులు కల్పించారు. ఇల్లు పూర్తి కావడంతో వృద్ధురాలు మార్త ముఖంలో ఆనందం కనిపించింది. 

 ఈనాడు, హనుమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని