అధికారులే కదిలొచ్చి... అందించారు ‘సదరం’

జీవచ్ఛవాలుగా మిగిలిన ఇద్దరు బిడ్డలు, క్రమంగా అనారోగ్యం బారిన పడుతున్న మరో చిన్నారి.. వీరి వేదన చూడలేక తల్లడిల్లుతున్న కుటుంబానికి ఉపశమనం లభించింది.

Published : 06 Dec 2022 04:52 IST

వచ్చేనెల నుంచే ముగ్గురు బాలురకు పింఛను ఇప్పించేలా చర్యలు

ఈనాడు, సంగారెడ్డి: జీవచ్ఛవాలుగా మిగిలిన ఇద్దరు బిడ్డలు, క్రమంగా అనారోగ్యం బారిన పడుతున్న మరో చిన్నారి.. వీరి వేదన చూడలేక తల్లడిల్లుతున్న కుటుంబానికి ఉపశమనం లభించింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రామిరెడ్డిపేటకు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతుల ఇద్దరు కుమారులకు గతంలో పింఛను వచ్చేది. కండర క్షీణతతో బాధపడుతున్న వీరికి సదరం ధ్రువపత్రం కాలపరిమితి ముగియడంతో రెండేళ్ల క్రితం ఆసరా నిలిచిపోయింది. అప్పటినుంచి దానిని పొందేందుకు అవసరమైన స్లాట్‌ నమోదు చేయించేందుకు దంపతులిద్దరూ పిల్లలను మోసుకుంటూ వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. అయినా వీరికి అవకాశం దొరకలేదు. ‘బతికేందుకు... ‘స్లాట్‌’ ఇస్తారా?’ శీర్షికతో ఈనెల 5న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. నడవలేని స్థితిలో ఉన్న పోచయ్య(10), మల్లేశం (8)తో పాటు శివకుమార్‌(3)ను సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యనిపుణులు వారిని పరీక్షించి ముగ్గురూ దివ్యాంగులేనని గుర్తించారు. ఇద్దరికి సోమవారమే సదరం పత్రాలు అందించారు. శివకుమార్‌కు ఆధార్‌కార్డు లేకపోవడంతో దరఖాస్తు చేయించి  త్వరలోనే సదరం అందిస్తామన్నారు. ఈ ముగ్గురికి వచ్చేనెల నుంచి పింఛను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు అరికపూడి రఘు చిన్నారులిద్దరికీ రెండు చక్రాల కుర్చీలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని