Hyderabad: ఇది గాల్లో ఎగిరే తిమింగలం.. శంషాబాద్‌లో దిగిన అతిపెద్ద కార్గో విమానం

తిమింగలం సముద్రంలో కదా ఉండేది.. గాల్లో ఎగరడం ఏమిటి? అనుకుంటున్నారా! మీ సందేహం ఎంత నిజమో.. ఇదీ అంతే నిజం.

Updated : 06 Dec 2022 13:01 IST

తిమింగలం సముద్రంలో కదా ఉండేది.. గాల్లో ఎగరడం ఏమిటి? అనుకుంటున్నారా! మీ సందేహం ఎంత నిజమో.. ఇదీ అంతే నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమిది. పేరు బెలుగా. దుబాయిలోని అల్‌ మక్‌తుమ్‌ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గంమధ్యలో ఇంధనం నింపుకొనేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగింది. తిరిగి సోమవారం రాత్రి 7.20 గంటలకు బయల్దేరి వెళ్లింది.

తిమింగలం ఆకారంలో ఉండే ఇది అనేక ప్రత్యేకతలు కల్గి ఉంది. ఎయిర్‌బస్‌ కంపెనీ సరకు రవాణా కోసం ఇలాంటి అయిదు విమానాలనే తయారు చేసింది. సాధారణంగా అన్ని విమానాల్లో వెనుక వైపు నుంచి లోడింగ్‌, ఆన్‌లోడింగ్‌ సదుపాయం ఉంటుంది. దీనికి మాత్రం ముందు నుంచి లోడింగ్‌ చేసే వీలుంది. లోడింగ్‌ సమయంలో ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా అంటోనొవ్‌ ఏఎన్‌-225 మ్రియాకు పేరుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా ఆ విమానాన్ని ఇటీవలే రష్యా ధ్వంసం చేసింది. దీంతో ఇదే అతిపెద్ద కార్గో విమానంతో ఖ్యాతిలోకి వచ్చింది.

బెలుగా ప్రత్యేకతలు ఇవీ..

* తొలి విమానం తయారీ: 1994 సెప్టెంబరు 13

* సేవలు ప్రారంభం: 1996

*  పొడవు: 184.3 అడుగులు

* ఎత్తు: 56.7 అడుగులు

*  ఒక రెక్క వైశాల్యం: 2,800 చ.అడుగులు

*  విమానం బరువు: 86.5 టన్నులు

*  కార్గో సామర్థ్యం: 47 టన్నులు

 ఈనాడు, హైదరాబాద్‌


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు