మాకు లోకం కనిపించదు.. మీకు మా సమస్యలు కనిపించవా?

తమ సమస్యలు పరిష్కరించాలని అంధ విద్యార్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

Published : 06 Dec 2022 04:50 IST

భోజనం చేయకుండా 4 రోజులుగా అంధ విద్యార్థుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని అంధ విద్యార్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నగరంలోని 4 (మూడు బాలుర, ఒక బాలిక) అంధ విద్యార్థుల వసతిగృహాల్లో 250 మంది వరకు వివిధ తరగతుల విద్యార్థులు వసతి పొందుతూ.. సమీప ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. తమ వసతిగృహాల్లో సమస్యలతో పాటు, విద్య, ఉద్యోగ విషయాలపై భోజనం తినకుండా ఆందోళన చేస్తున్నా అధికారులెవరూ స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చర్చలకు పిలిచినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.

సమస్యలు.. డిమాండ్లు..

‘‘ఇంటర్‌, ఆపై చదివే అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలి. డిగ్రీ చదువుతున్నవారికే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని అధికారులు చెప్పడంతో ఇంటర్‌ విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులందరికీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ ఇవ్వాలి. కాస్మోటిక్‌ కిట్లు కాకుండా.. ఛార్జీలను ప్రతి నెలా నగదు రూపంలో చెల్లించాలి. మూడు నెలలకోసారి ఇస్తున్న నాసిరకమైన వస్తువులతో చర్మవ్యాధులు, ఇతర ఇబ్బందులు వస్తున్నాయి. ఏటా దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని నిబంధనలు చెబుతున్నా.. ఆరేళ్లుగా ఒక్క పోస్టుకూ ప్రకటన ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేందుకు శిక్షణ ఇవ్వాలి. బీఈడీ, డీఈడీ ఇతర కోర్సులు చదువుతున్నవారిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. దుస్తుల కొనుగోలుకు గతంలో మాదిరి రూ.3 వేల విలువైన కార్డు జారీ చేయాలి’’ అని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

‘‘అంధ విద్యార్థులకు నిబంధనల ప్రకారం కాస్మోటిక్‌ కిట్స్‌, దుస్తులు అందిస్తున్నాం. అర్హులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. విద్యార్థుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం’’ అని దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ శైలజ ‘ఈనాడు’తో చెప్పారు. వసతి గృహానికి ఇద్దరు చొప్పున ప్రతినిధుల్ని చర్చలకు పిలిచామని, మంగళవారానికి సమస్య పరిష్కారమవుతుందని దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని