బీటెక్‌ను దాటి.. బీకాం దూకుడు

రాష్ట్రంలో బీటెక్‌లో చేరిన విద్యార్థుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందినవారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలింది.

Published : 06 Dec 2022 05:26 IST

డిగ్రీలో 41 శాతం కామర్స్‌ విద్యార్థులే
దోస్త్‌ ప్రవేశాలు ఈసారి 2.10 లక్షలు
వారిలో అమ్మాయిలు 52 శాతం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీటెక్‌లో చేరిన విద్యార్థుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందినవారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలింది. తొలిసారిగా బీటెక్‌ కంటే బీకాందే పైచేయి అయిందని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో గతానికి మించి రికార్డు స్థాయిలో కన్వీనర్‌ కోటాలో 62వేల మంది, యాజమాన్య కోటాలో సుమారు 20వేల మంది, ప్రైవేట్‌ వర్సిటీల్లో మరో 10వేల వరకు.. మొత్తంగా 92వేల మంది ప్రవేశాలు పొందారు. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో మొత్తం 2,10,970 మంది చేరగా.. వారిలో 87,480 మంది అంటే 41.47 శాతం  బీకాం విద్యార్థులే ఉండటం విశేషం. మొత్తం విద్యార్థుల్లో 1,09,480 మంది(52.06 శాతం) మంది అమ్మాయిలే. బీఎస్‌సీ లైఫ్‌సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌(బీఎస్‌డబ్ల్యూ) కోర్సుల్లో అమ్మాయిలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా బీఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌లో 75శాతం వారే ఉండటం గమనార్హం. ఈసారి బీటెక్‌లో 80వేల మంది ప్రవేశాలు పొందగా.. డిగ్రీలో 2.10 లక్షల మంది చేరారు. అంటే ఇంజినీరింగ్‌ కంటే రెండున్నర రెట్లకు పైగా డిగ్రీ విద్యార్థులున్నారు.

నాన్‌ దోస్త్‌ ప్రవేశాలను కలుపుకొంటే...

దోస్త్‌ ద్వారా బీకాంలో 87,480 మంది చేరగా.. దానితో సంబంధం లేకుండా సొంతగా ప్రవేశాలు పూర్తి చేసుకున్న కళాశాలలు మరో 40 వరకు ఉన్నాయి. వాటిలో 15వేల మంది ప్రవేశాలు పొందారని, అత్యధికంగా బీకాం, బీఎస్‌సీ కోర్సుల్లో చేరారని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. వారిలో కనీసం ఆరేడు వేల మంది బీకాం విద్యార్థులు ఉంటారని, రాష్ట్రంలో బీకాం ప్రవేశాల సంఖ్య 93,480 మందికి తగ్గదని అంచనా వేస్తున్నామన్నారు. దీన్నిబట్టి తొలిసారిగా బీటెక్‌ను మించి రాష్ట్రంలో బీకాం ప్రవేశాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని లింబాద్రి చెప్పారు. కామర్స్‌లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని, దానికితోడు కంప్యూటర్‌ సబ్జెక్టును జోడించడం, కొత్తగా బీకాం బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టడం వంటి కారణాల వల్ల ఆ కోర్సులో చేరికలు  పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని