వంశీరామ్‌లో ఐటీ సోదాలు

రాష్ట్రంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌లో ఆదాయపన్నుశాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది.

Updated : 07 Dec 2022 05:49 IST

నిర్మాణ సంస్థకు సంబంధించి పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌లో ఆదాయపన్నుశాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది. సంస్థ కార్యాలయం, నిర్మాణంలో ఉన్న వెంచర్లతోపాటు ఛైర్మన్‌, భాగస్వామి ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున పత్రాలు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే వ్యవహారంలో విజయవాడలోని వైకాపా నాయకుడు దేవినేని అవినాశ్‌ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వంశీరామ్‌ బిల్డర్స్‌ 1996 నుంచి నిర్మాణ రంగంలో ఉంది. వాణిజ్యపరమైన కార్యాలయాలు, నివాస సముదాయలు, ఐటీ పార్కుల వంటివి 80కి పైగా నిర్మించగా అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మంగళవారం ఆదాయపన్నుశాఖకు చెందిన దాదాపు 25 బృందాలు ఒకేసారి వంశీరామ్‌ సంస్థలకు చెందిన కార్యాలయాలు, ఇళ్లకు చేరుకున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి కొన్ని బృందాలు వెళ్లగా రోడ్‌ నంబర్‌ 17లో ఉన్న సంస్థ భాగస్వామి జనార్దనరెడ్డి ఇంటికి కొన్ని, నంది హిల్స్‌లోని సంస్థ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ఇంటికి మరికొన్ని బృందాలు చేరుకున్నాయి. ఇంకొన్ని బృందాలు నగర శివార్లలోని నిర్మాణంలో ఉన్న వెంచర్లకు చేరుకున్నాయి. సీఆర్‌పీఎఫ్‌ భద్రత తీసుకున్న అధికారులు సోదాల విషయాన్ని గోప్యంగా ఉంచారు. రాత్రి పొద్దుపోయే వరకూ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వంశీరామ్‌ బిల్డర్స్‌కు ఛైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి వంశీరామ్‌ ఎస్టేట్స్‌, వంశీరామ్‌ ఏఆర్‌ఆర్‌ వెంచర్స్‌, వంశీరామ్‌ పృథ్వీ బిల్డర్స్‌, వంశీరామ్‌ వినీల్‌ వెంచర్స్‌ వంటి మొత్తం 19 సంస్థల్లో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను అధికారులు వీటికి సంబంధించిన కొన్ని కార్యాలయాల్లోనూ సోదాలు జరిపినట్లు సమాచారం. ఆదాయపన్ను చెల్లింపులో వ్యత్యాసం ఉందన్న అనుమానంతోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు.  కొన్ని నెలలుగా రాష్ట్రంలోని వివిధ వ్యాపార సంస్థలు అందులోనూ నిర్మాణరంగానికి చెందిన సంస్థల్లో ఆదాయపన్నుశాఖ తనిఖీల విషయం చర్చనీయాంశంగా మారింది.

వైకాపా నేత దేవినేని అవినాష్‌ నివాసంలో ఇలా...

ఈనాడు-అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ ఇంట్లో ఆదాయపన్ను విభాగం బృందాలు మంగళవారం సోదాలు చేపట్టాయి. ఉదయం ఆరు గంటలకు విజయవాడలోని గుణదలలో ఆయన ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు. లోపలకు ఎవరినీ రానీయకుండా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను ప్రధానగేటు వద్ద కాపలా ఉంచారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబరు-2లోని స్థలం డెవలప్‌మెంట్‌ కోసం వంశీరామ్‌ బిల్డర్స్‌తో అవినాష్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.  సోదాల విషయం తెలుసుకున్న నగర కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని