11న కవిత ఇంటికి సీబీఐ

దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదుచేయాలని సీబీఐ నిర్ణయించింది.

Published : 07 Dec 2022 05:22 IST

దిల్లీ మద్యం కేసులో వాంగ్మూలం నమోదు చేస్తామంటూ సమాచారం
అందుబాటులో ఉంటానంటూ ఎమ్మెల్సీ ప్రత్యుత్తరం

ఈనాడు,హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదుచేయాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు దిల్లీలోని సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆమెకు మంగళవారం మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కేసుకు సంబంధించి వాంగ్మూలం నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో అందుబాటులో ఉండే విషయాన్ని నిర్ధారించాలంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. 6వ తేదీన హాజరుకావాల్సిందిగా దిల్లీ సీబీఐ అధికారులు తొలుత ఈ నెల 2న కవితకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసు పంపారు. ఆ విషయాన్ని అదేరోజు కవిత ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అనంతరం సీబీఐకి లేఖ రాశారు. తనకు ఆరో తేదీన ఇతర కార్యక్రమాలున్నాయని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని అందులో వెల్లడించారు. దీనికి స్పందిస్తూ సీబీఐ డీఐజీ మంగళవారం కవితకు మరో మెయిల్‌ పంపారు. ‘‘మీరు పేర్కొన్న నాలుగు తేదీలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సీబీఐ బృందం మీ నివాసానికి వస్తుంది. ఆ సమయంలో మీరు అందుబాటులో ఉండగలరు’’ అని పేర్కొన్నారు. సీబీఐ తాజా మెయిల్‌కు కవిత స్పందించారు. 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో అందుబాటులో ఉంటానన్నారు. ఈ మేరకు తన అంగీకారం తెలుపుతూ మంగళవారం సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్సకు మెయిల్‌లో సమాచారం పంపారు.

దిల్లీ మద్యం కేసులో దక్షిణాది లాబీ కీలకపాత్ర పోషించిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది సర్కిల్స్‌ దక్కించుకుందని, ఇందుకుగాను పెద్ద మొత్తంలో నిధులు చేతులు మారాయనేది దర్యాప్తు సంస్థల ప్రాథమిక అభియోగం. ఈ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి సీబీఐ, నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ వేర్వేరుగా కేసులు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ బోయినపల్లిని సీబీఐ, శరత్‌చంద్రారెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేశాయి. ఇదే కేసులో కవితను సాక్షిగా సీబీఐ విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని