1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ

ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం వెలువరించింది.

Updated : 07 Dec 2022 05:52 IST

వెలువడిన నియామక ప్రకటన
20 నుంచి వచ్చే నెల 5 వరకూ దరఖాస్తుల స్వీకరణ
ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం వెలువరించింది. ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి వచ్చే నెల 5న సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ప్రైవేటు ప్రాక్టీసు అంశంలో స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యంలో సేవలందించాలనే ఆసక్తి ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటారని, అలాంటి వారు పోస్టింగ్‌ ఎక్కడ ఇచ్చినా పనిచేస్తారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీలోనూ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నా, గతంలో పనిచేసినా..ఆ అనుభవానికి మార్కులుంటాయి. రానున్న మూడు నెలల్లోపు ఈ నియామక ప్రక్రియను పూర్తిచేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి. ఎంపికైన అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో వెల్లడిస్తామని తెలిపాయి.

అర్హత మార్కులకు 80 పాయింట్లు

* స్పెషలిస్ట్‌ వైద్యులకు..పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌/సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు నిర్ధారిస్తారు.

* మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివిన అభ్యర్థులకు గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని పాటిస్తారు. గ్రేడ్‌ ‘ఎ’లో 60 శాతం మార్కులను ఎక్స్‌లెన్స్‌గా, ‘బి’గ్రేడ్‌లో 55 శాతాన్ని ‘గుడ్‌’గా నిర్ణయించారు.

* 50 శాతం వస్తే పాస్‌ గ్రేడ్‌గా నిర్ధారిస్తారు.

* మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో సహాయ ఆచార్యులుగా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయిస్తారు.

* ఈ కేటగిరీ అభ్యర్థులు ఒప్పంద, పొరుగు సేవల అనుభవ ధ్రువపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికి దరఖాస్తు చేయాలి. 15 రోజులలోపు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి లేదా తిరస్కరించాలి.

* అభ్యర్థులు సంబంధిత అధికారులు జారీచేసిన ధ్రువపత్రాన్ని, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ దరఖాస్తుకు జతచేయాలి.

* అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న నిర్దేశిత కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని పోస్ట్‌లకూ వారి ప్రాధాన్యాలను ప్రస్తావించాలి. పొందిన పాయింట్లు, ప్రాధాన్యత ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు.

ఆరు నెలలకు 2.5 పాయింట్లు

గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు అధికంగా వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. అక్కడ 6 నెలల పనికాలానికి 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. 6 నెలల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే వెయిటేజీకి అర్హులుగా పరిగణిస్తారు. ఒప్పంద, పొరుగు సేవలకు సంబంధించిన పాయింట్లు దరఖాస్తు చేసిన పోస్ట్‌ కేటగిరీలోని సర్వీస్‌కు మాత్రమే అందిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో సహాయ ఆచార్యుడి పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న పక్షంలో.. గతంలో ప్రభుత్వ వైద్యంలో సంబంధిత స్పెషాలిటీ విభాగంలో ఏ ప్రాంతంలో పనిచేశారనే ప్రాతిపదికన పాయింట్లు కేటాయిస్తారు. సీనియర్‌ రెసిడెంట్లకు కూడా పాయింట్లు కేటాయిస్తారు.

అనుభవానికి ఆధారాలుండాల్సిందే

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, హాజరు పట్టీలకు సంబంధిత దస్త్రాలను సూచించాలి. వాటి కాపీలనూ జత చేయాలి. నిర్దేశిత రూపంలో సంబంధిత ఆసుపత్రుల బాధ్యుల నుంచి అనుభవ ధ్రువీకరణను పొందాలి.

గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు

గరిష్ఠ వయసు 44 ఏళ్లు. టీఎస్‌ఆర్‌టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నవారికి, ఎస్సీ ఎస్టీ బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

* పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు.

* దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు