రూ.6,200 కోట్లతో డేటా కేంద్రం

సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్యాండ్‌ తెలంగాణలో రూ.6,200 కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది.

Published : 07 Dec 2022 05:24 IST

రాష్ట్ర ప్రభుత్వంతో అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్యాండ్‌ ఒప్పందం
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంఓయూ
5 వేల మందికి ఉపాధి

ఈనాడు, హైదరాబాద్‌: సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్యాండ్‌ తెలంగాణలో రూ.6,200 కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో క్యాపిటల్యాండ్‌ ఇండియా ట్రస్టు(క్లింట్‌) తెలంగాణ ప్రభుత్వంతో మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, క్యాపిటల్యాండ్‌ భారత విభాగం సీఈఓ సంజీవ్‌ దాస్‌గుప్తా సంతకాలు చేశారు.

దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం

ఈ సందర్భంగా సంజీవ్‌ దాస్‌గుప్తా మాట్లాడారు. ‘‘సింగపూర్‌ కేంద్రంగా 22 ఏళ్ల క్రితం ఏర్పాటైన క్యాపిటల్యాండ్‌ సంస్థ ద్వారా 30 దేశాల్లోని 260 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. ఆసియా, యూరప్‌లలో 25 డేటా కేంద్రాల ద్వారా కొన్నేళ్లుగా డేటా సెంటర్‌ డిజైన్‌, అభివృద్ధి, నిర్వహణలో మిగతావారి కంటే ముందున్నాం. ఇప్పటికే దేశంలో ఒక డేటా కేంద్రం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోనే అతిపెద్ద డేటా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం. పదేళ్ల క్రితం హైదరాబాద్‌ మార్కెట్‌లో అడుగుపెట్టాం. సైబర్‌ పెర్ల్‌, ఎవాన్స్‌, ఐటీపీహెచ్‌ పార్కుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం. దాదాపు 30.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 70 సంస్థలు నడుస్తుండగా.. 30 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే డేటా కేంద్రం ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ సేవలందిస్తాం. ఇది అయిదేళ్లలో అందుబాటులోకి వస్తుంది’’ అని సంజీవ్‌ తెలిపారు.

డేటా కేంద్రాల హబ్‌గా తెలంగాణ

తెలంగాణలో క్యాపిటల్యాండ్‌ పెట్టుబడులను మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. ‘‘డేటా కేంద్రాలకు రాష్ట్రం హబ్‌గా మారింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా కేంద్రాల మార్కెట్లలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు కొత్త డేటా కేంద్రం ద్వారా తీరనున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని కేటీఆర్‌ అన్నారు. క్యాపిటల్యాండ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ, రియల్‌ ఎసెట్స్‌ సీఈఓ పాట్రిక్‌ బూకాక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని