మార్చి నుంచి 800 మెగావాట్ల విద్యుత్కేంద్ర నిర్మాణ పనులు

సింగరేణి సంస్థ రూ. 6800 కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం టెండర్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.

Published : 07 Dec 2022 04:32 IST

సత్వరమే టెండర్ల ప్రక్రియ
సింగరేణి సీఎండీ శ్రీధర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ రూ. 6800 కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం టెండర్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. సీఎం ఆదేశం మేరకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం నవంబరులో దేశవ్యాప్త టెండర్లను పిలిచామని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని, నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులను చేపడతామని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద 1200 మెగావాట్ల కొత్త విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించనున్నామని, అక్కడున్న బొగ్గు రవాణా, నీటి వసతులను వినియోగించుకుంటామని తెలిపారు. సీఎండీ బుధవారం హైదరాబాద్‌ సింగరేణిభవన్‌లో థర్మల్‌, సౌర విద్యుత్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) డి.సత్యనారాయణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 800 మెగావాట్ల కొత్త విద్యుత్కేంద్రం టెండర్ల గడువు ముగిశాక ఎంపిక ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. మార్చి నుంచే నిర్మాణ పనులను ఆరంభించాలన్నారు. సింగరేణిలో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సౌర ప్లాంట్లను వచ్చే మార్చి నాటికి ప్రారంభించాలని, వీటిలో తొలి 5 మెగావాట్ల ఫ్లోటింగ్‌ ప్లాంటును నెలాఖరుకల్లా సిద్ధం చేయాలన్నారు. మూడో దశలోని  రామగుండం 3 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌ 1 ఓవర్‌ బర్డెన్‌డంప్‌ పై తొలిసారిగా నిర్మిస్తున్న 22 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంటు, చెన్నూరు ప్రాంతంలో 11 మెగావాట్లు, కొత్తగూడెంలో 33 మెగావాట్ల ప్లాంట్ల టెండర్‌ ప్రక్రియ పూర్తయినందున, పనులను వెంటనే చేపట్టి వచ్చే జూన్‌కు పూర్తి చేయాలన్నారు. సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌లో పర్యావరణ హిత చర్యగా రూ700 కోట్లËతో నిర్మించనున్న ఫ్లుగ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ యూనిట్‌ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అత్యధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌తో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు డైరెక్టర్‌, ఇతర అధికారులకు అభినందనలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని