ప్రకటనల్లోనే రాష్ట్ర అభివృద్ధి: కిషన్‌రెడ్డి

ప్రకటనల్లోనే తెలంగాణలో అభివృద్ధి కనపడుతోందని, ఆచరణలో శూన్యమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 07 Dec 2022 04:46 IST

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: ప్రకటనల్లోనే తెలంగాణలో అభివృద్ధి కనపడుతోందని, ఆచరణలో శూన్యమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్‌ మంత్రిగా సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ ఉన్నా నగరంలో అభివృద్ధి లేదన్నారు. రేషన్‌ బియ్యం అందించడంతో పాటు పొదుపు సంఘాలకు కేంద్రమే రుణం ఇస్తోందని, ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేంటని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే వెంటనే తన బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు. రెండు పడకగదుల ఇళ్లెక్కడ? అని ప్రతీ పేదవాడి గుండె ఆవేదన చెందుతోందన్నారు. భాజపా చేపట్టిన ‘జనంతో మమేకం’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం బంజారాహిల్స్‌, వెంకటేశ్వరకాలనీ డివిజన్లలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎన్‌బీటీనగర్‌లోని ఓ వీధిలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నగర మేయర్‌ నివసించే ప్రాంతంలో పారిశుద్ధ్యం ఉండేది ఇలాగేనా అని మండిపడ్డారు. ప్రగతిభవన్‌ ఎదుట, మేయర్‌ నివాసం ఎదుట చెత్త ఉంటే ఊరుకుంటారా? అని సర్కిల్‌-18 డీఎంసీ రజనీకాంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో 80 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తున్నా.. అభివృద్ధి జరగడం లేదన్నారు. రాష్ట్రంలో నూతన పింఛన్లు, రేషన్‌ కార్డులకు అతీగతీ లేదని, కేంద్రప్రభుత్వం చెప్పినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు తప్ప అంతర్గత రహదారులు, బస్తీల్లోకి అడుగుపెడితే ప్రజలు సమస్యలు ఏకరవు పెడుతున్నారన్నారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లుగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మహాలక్ష్మి రామన్‌గౌడ్‌, భాజపా మహిళామోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పల్లె వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని