నిషేధిత జాబితాలోని భూములపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురంలో రైతుల స్వాధీనంలో ఉన్న భూములను అటవీ భూములుగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated : 07 Dec 2022 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురంలో రైతుల స్వాధీనంలో ఉన్న భూములను అటవీ భూములుగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న రైతుల నుంచి ముడుపులు డిమాండ్‌ చేస్తున్నారంటూ అందిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకుపైగా నిషేధిత జాబితాలో చేర్చారని లేఖలో పేర్కొన్నారు. స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, 3.84 లక్షల ఎకరాలను అటవీ భూమిగా ధరణిలో ఉంచారన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న భూముల సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి స్టాంపు డ్యూటీగా రూ.680 కోట్లు వసూలు చేసినట్లు, అయినా సమస్యలను పరిష్కరించలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని