దర్యాప్తును కోర్టులు నిరోధించరాదు

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని.. ఈ దశలో దర్యాప్తును కోర్టులు నిరోధించరాదని, ఆ హక్కు కోర్టులకు ఉండదని సిట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే  హైకోర్టుకు నివేదించారు.

Published : 07 Dec 2022 04:46 IST

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు ప్రాథమిక దశలోనే ఉంది
నిందితులకు విచారణ సంస్థను ఎంచుకునే హక్కులేదు
సిట్‌ తరఫున హైకోర్టులో దుష్యంత్‌దవే వాదనలు
కేసును సీబీఐకి అప్పగించాలన్న భాజపా పిటిషన్‌పై హైకోర్టు విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని.. ఈ దశలో దర్యాప్తును కోర్టులు నిరోధించరాదని, ఆ హక్కు కోర్టులకు ఉండదని సిట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే  హైకోర్టుకు నివేదించారు. అభియోగ పత్రం దాఖలు చేశాకే కోర్టుల పాత్ర ఉంటుందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ భాజపా తరఫున పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌, తుషార్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం వాదనలు విన్నారు. దీనిపై తదుపరి విచారణ బుధవారం కొనసాగనుంది.

సిట్‌ తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ‘‘న్యాయపరమైన రక్షణ నిందితుడికి ఎప్పుడూ ఉంటుంది. కింది కోర్టులో డిశ్ఛార్జి పిటిషన్‌, కేసు కొట్టివేయాలని పిటిషన్‌లు వేసుకోవచ్చు. ఇవన్నీ దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలు చేసిన తరువాతే. దర్యాప్తు దశలోనే కోర్టును ఆశ్రయించి హైకోర్టుకు ఉన్న విచక్షణాధికారాన్ని వినియోగించుకోవాలని కోరడం సరికాదు. రాజకీయపరమైన దురుద్దేశాలతో కేసు నమోదు చేశారని చెప్పడం సరిపోదు. దర్యాప్తును సీబీఐతో జరిపించాలని నిందితులే సూచిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు నిందితులకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరం సమయంలో డబ్బు దొరకలేదన్న కారణంగా ముడుపుల కేసు కాదనడం సరికాదు. ఓటరును ప్రలోభపెట్టిన కారణంగా ఓ ఎన్నికను రద్దు చేస్తూ జస్టిస్‌ కృష్ణఅయ్యర్‌ తీర్పు వెలువరించారు. ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు ఇక్కడ ఆధారాలున్నాయి. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మౌలికాంశాలు. వీటిని ధ్వంసం చేసే పరిస్థితి కల్పించినవారికి అదే రాజ్యాంగంలోని అధికరణ 226 కింద రక్షణ కల్పించడానికి వీల్లేదు. పార్టీ ఫిరాయింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పార్టీలు మారుతున్నారని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చినా ఉపయోగం ఉండడంలేదు. ఓటర్లు అందరూ తమ ప్రతినిధిగా ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు.. అతను అమ్ముడుపోతే ఓటరు గొంతు మూగపోయినట్లే. అది ప్రజల హక్కులను కాలరాసినట్లే. అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ప్రజాప్రతినిధులను తీసుకువస్తూ చట్ట సవరణ జరిగింది. సీఆర్‌పీసీ 41ఎ కింద అరెస్ట్‌ చేయవచ్చు. నిందితుల సంభాషణ 3గంటలపాటు రికార్డు ఉంది. దిల్లీలోని అత్యున్నత స్థాయి వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు. నిందితులతో పార్టీకి సంబంధం లేదంటూనే వారిపై కేసును కొట్టివేయాలని కోర్టుకు వస్తున్నారు. పిటిషన్‌ వేసే అర్హత పార్టీకి లేదు. సీబీఐ దర్యాప్తుపై కూడా ఆరోపణలున్నాయి’’ అని వివరించారు.

సంజయ్‌ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు: శ్రీనివాస్‌ 

ఈ కేసులో ఫిర్యాదుదారులు, సాక్షులు, మధ్యవర్తులు, దర్యాప్తుదారులు అందరూ పోలీసులేనని శ్రీనివాస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉదయ్‌ హొళ్ల తెలిపారు. ‘‘నా క్లయింట్‌ సాక్షి మాత్రమే. అయినా నిందితుడికి జారీ చేసే 41ఎ కింద నోటీసు ఇచ్చారు. 30 మంది పోలీసులు వచ్చి ఇంటికి నోటీసు అతికించి దాన్ని పత్రికల్లో ప్రచురించారు. నా క్లయింట్‌ రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్‌ పేరు చెప్పాలని ఆయనను ఒత్తిడి చేశారు. విచారణ వీడియో రికార్డింగ్‌ను బయటపెడితే వారు ఎలా ఒత్తిడి చేశారో తెలుస్తుంది. సీఎం మీడియా సమావేశం నిర్వహించి దర్యాప్తుపై సూచనలు చేస్తుంటారు. నా క్లయింట్‌పై ఆరోపణలు ఏమిటో చెప్పలేదు. వృత్తిలో భాగంగా ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడితే నేరం చేసినట్లు వేధింపులకు గురిచేస్తున్నారు. కేసును కొట్టివేయాలనడంలేదు. పారదర్శకమైన దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలి’’ అని పేర్కొన్నారు.

సీఎంకు నోటీసులు ఇవ్వాలన్న తుషార్‌ న్యాయవాది.. ఏఏజీ అభ్యంతరం..

పిటిషన్‌లో సీఎం 7వ ప్రతివాదిగా ఉన్నారని, ఆయనకు నోటీసులు ఇచ్చి కౌంటరు దాఖలుకు ఆదేశించాలని తుషార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కోరారు. దీనిపై అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎంకు నోటీసులు ఇవ్వడంపై ప్రాథమిక అభ్యంతరాలున్నాయని, వాటిపై వాదనలు వినిపిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని