శిల్ప కళాభివృద్ధికి యాదాద్రిలో కళాశాల

అంతరించిపోతున్న శిల్పకళను పునరుద్ధరించాలని, రాబోయే తరాలకు సిద్ధహస్తులైన శిల్పులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Published : 07 Dec 2022 04:46 IST

15 మందితో ప్రారంభమైన తరగతులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: అంతరించిపోతున్న శిల్పకళను పునరుద్ధరించాలని, రాబోయే తరాలకు సిద్ధహస్తులైన శిల్పులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో యాదాద్రిలో మూడేళ్ల కోర్సుతో కూడిన డిగ్రీ కళాశాలను ఈ నెల 4న ప్రారంభించారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలో మాత్రమే శిల్ప కళా విద్యాలయం ఉంది. తెలంగాణలో సైతం ఇలాంటి విద్యావ్యవస్థ ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం.. వైటీడీఏ కృషితో మూడేళ్ల వృత్తి విద్యా కోర్సుతో డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. దీనికోసంప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ప్రస్తుతం రూ.50 లక్షలు విడుదల చేసింది.

ఏటా 15 సీట్లు: ప్రస్తుతానికి ఇందులో 15 సీట్లున్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నెలలో విడుదల చేసిన ప్రకటన ఆధారంగా ఏపీ, తెలంగాణలకు చెందిన 15 మంది ప్రవేశాలు పొందారు.  వీరిలో నలుగురు యువతులు ఉన్నారు. తరగతులు కొనసాగుతున్నాయి. కోర్సులో శిల్ప శాస్త్రంలోని కళలన్నిటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంకులోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఈ కళాశాల కొనసాగనుంది.

ప్రత్యేక శద్ధ్ర వహించి..

శిల్పకళాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఏటా రూ.కోటి ఖర్చుతో కళాశాలను కొనసాగించేందుకు బాధ్యత వహిస్తున్న మా సంస్థకు వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ సీజీఎఫ్‌ నుంచి రూ.50 లక్షలు, యాదాద్రి దేవస్థానం నుంచి రూ.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

కిషన్‌రావు, వైస్‌ఛైర్మన్‌, వైటీడీఏ


తరతరాలను అలరిస్తాయి

చిరస్థాయిగా నిలిచేలా శిల్ప కళాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిలో వైటీడీఏ నేతృత్వంలో శిల్పకళాశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ శాస్త్రంలోని కళలన్నింటిపై శిక్షణ ఇస్తాం. 

 మోతీలాల్‌, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని