గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని గోదావరి పరీవాహకంలో నదీ జలాల లభ్యతపై అధ్యయనం చేయించాలని బోర్డు భావిస్తోంది.

Published : 07 Dec 2022 04:46 IST

15న బోర్డు సమావేశంలో చర్చ
మూడు అంశాలపై చర్చకు తెలంగాణ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని గోదావరి పరీవాహకంలో నదీ జలాల లభ్యతపై అధ్యయనం చేయించాలని బోర్డు భావిస్తోంది. ఈ నెల 15న నిర్వహించనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో రెండు రాష్ట్రాల ముందు ఈ అంశాన్ని పెట్టనుంది. సమావేశం ఎజెండాలో 16 అంశాలు ఉండగా అందులో చివరిది గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం. ఏదైనా నైపుణ్య సంస్థకు బాధ్యతలు అప్పగించి మదింపు చేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే, బోర్డులో సభ్యులైన రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది.

రెండు రాష్ట్రాల సరిహద్దులతో పాటు గోదావరిపై పలు ప్రాంతాల్లో నీటి పరిమాణాన్ని అంచనా వేసేందుకు టెలీమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. దీనికోసం అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను నమోదు చేయడం, నీటి నిర్వహణకు బోర్డు రెండు రాష్ట్రాల నుంచి నిధులు కోరనున్నట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రాయోజిత హైడ్రాలజీ ప్రాజెక్టులో ఇప్పటికే రాష్ట్రాలు టెలిమెట్రీ కేంద్రాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన గూడెం ఎత్తిపోతల పథకం, మోడికుంట వాగు సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఏపీ ప్రాజెక్టులపై ప్రస్తావించనున్న తెలంగాణ..

గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాటిపై కసరత్తు చేసిన నీటిపారుదలశాఖ ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు తెలిసింది. బోర్డు ఎజెండాలో ఇవి లేకున్నా ఛైర్మన్‌ అనుమతితో చర్చకు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

* పోలవరం ప్రాజెక్టు వెనక ప్రాంతంలో 135 అడుగుల కింద నుంచి నీటిని తోడిపోసుకునేలా ఏపీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురానుంది. దాన్ని అనుమతులు లేని ప్రాజెక్టుగా గుర్తించి అడ్డుకోవాలని కోరనుంది.

* గోదావరి-పెన్నా బేసిన్లను అనుసంధానం చేసేందుకు పోలవరం నుంచి కృష్ణా నదిపై ఒక అక్విడక్టు నిర్మించి నీటిని తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించనుంది.

* గోదావరిలో ఏపీకి 518 టీఎంసీల కేటాయింపు మాత్రమే ఉన్నా,  760 టీఎంసీల జలాలకు సంబంధించి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ఉన్నట్లు ఏపీ చెబుతుండటంపై అభ్యంతరం వ్యకం చేయనుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు