కొలిక్కివచ్చిన రింగురోడ్డు దక్షిణ భాగం

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డుకు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగం రహదారి ప్రణాళిక (అలైన్‌మెంట్‌) కొలిక్కి వచ్చింది.

Updated : 07 Dec 2022 10:25 IST

క్షేత్రస్థాయిలో పూర్తయిన అధ్యయనం..కేంద్రానికి చేరిన నివేదిక
రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తుది మార్పులు పూర్తి
347 కిలో మీటర్లు దాటిన ప్రాంతీయ రింగు రోడ్డు
నెలాఖరులోగా కేంద్రం పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డుకు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగం రహదారి ప్రణాళిక (అలైన్‌మెంట్‌) కొలిక్కి వచ్చింది. 189.23 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మించాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధ్యయనంలో నిర్ధారించినట్లు సమాచారం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దూరంతో పోలిస్తే 7.37 కిలోమీటర్లు పెరిగింది. భారత్‌మాల పరియోజన పథకం కింద ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించటంతో దక్షిణ భాగం అలైన్‌మెంటు ప్రతిపాదనలను దిల్లీకి చెందిన ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ లిమిటెడ్‌’ సంస్థ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు అందచేసింది.

రెండు భాగాలుగా..

ప్రాంతీయ రింగు రోడ్డును రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం భూ సేకరణ తుది దశలో ఉంది. దక్షిణ భాగం మార్గాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం మూడు నెలల కిందట గుత్తేదారును ఎంపిక చేసింది. క్షేత్రస్థాయిలో ఆ సంస్థ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ముసాయిదా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మూడు, నాలుగు ప్రాంతాల్లో ఉన్న నీటి రిజర్వాయర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రహదారి ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించటంతో ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి కేంద్రానికి నివేదించింది. ప్రాంతీయ రింగు రోడ్డు దూరం 347.87 కిలోమీటర్లకు చేరుకుంది. గతంలో ఉత్తర భాగాన్ని 158.416 కిలోమీటర్లుగా ప్రతిపాదించారు. అతి స్వల్పంగా పెరిగి 158.645 కిలోమీటర్లకు చేరింది. ఆ మేరకు భూ సేకరణకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా దక్షిణ భాగం అధ్యయనం పూర్తి అయింది. గతంలో 181.864 కిలోమీటర్లుగా ప్రతిపాదించగా ప్రస్తుతం ఆ మార్గం 189.23 కిలోమీటర్లకు పెరిగింది. దక్షిణ భాగం కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్‌, షాద్‌నగర్‌, ఆమనగల్లు, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌ మీదుగా చౌటుప్పల్‌కు కలుస్తుంది. ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగ్‌దేవ్‌పూర్‌, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌కు చేరుతుంది. దక్షిణ భాగానికి సంబంధించి కేంద్రం నుంచి తుది నోటిఫికేషన్‌ జారీ కావాల్సి ఉంది. ఆ మార్గానికి సంబంధించి మూడు ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి కన్సల్టెన్సీ సంస్థ అందచేసింది. వీటిలో ఒకదానిని నెలాఖరులోగా ఖరారు చేసేందుకు కేంద్రం పరిశీలించనుందని సమాచారం.

త్వరలో జాతీయ రహదారి నంబరు?

ప్రాంతీయ రింగు రోడ్డులో ఉత్తర భాగానికి మాత్రమే ఇప్పటివరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి తాత్కాలిక నంబరును కేటాయించింది. దక్షిణ భాగానికి నంబరు కేటాయించాల్సి ఉంది.  ఈ నెలాఖరులోగా అలైన్‌మెంట్‌ వ్యవహారం కొలిక్కి వస్తుందని సమాచారం. అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేయటానికి ముందుగానే దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించనుంది. మంత్రిత్వ శాఖలో ఇందుకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. నంబరు కేటాయింపుతోపాటు అలైన్‌మెంటు ఖరారు చేస్తూ గజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తరవాత భూ సేకరణ ప్రక్రియను రూపొందించేందుకు అవసరమైన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇప్పటికే ఉత్తర భాగంలో భువనగిరి, చౌటుప్పల్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యవహారాల్లో అధికారులు ఇటీవలివరకు తలమునకలుగా ఉండటంతో భూసేకరణ తాత్కాలికంగా నిలిచింది. త్వరలో ఆ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అలైన్‌మెంట్‌ ఖరారు తరవాత దక్షిణ భాగం భూ సేకరణ ప్రక్రియ కసరత్తు మొదలవుతుంది. మొత్తమ్మీద ప్రాంతీయ రింగురోడ్డు వ్యవహారాల దస్త్రాలు చకచకా కదులుతున్నాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు