సిట్‌కు విశ్వసనీయత లేదు

ప్రజాస్వామ్యం... విలువల గురించి మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడిందని, అలాంటప్పుడు మరోపార్టీ వైపు వేలెత్తి చూపే హక్కు ఎక్కడుందని కరీంనగర్‌కు చెందిన బి.శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.

Published : 08 Dec 2022 03:11 IST

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న తెరాస గతంలో ఎమ్మెల్యేలను కొన్నది
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యం... విలువల గురించి మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడిందని, అలాంటప్పుడు మరోపార్టీ వైపు వేలెత్తి చూపే హక్కు ఎక్కడుందని కరీంనగర్‌కు చెందిన బి.శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, ముగ్గురు నిందితులతోపాటు, తుషార్‌, న్యాయవాది బి.శ్రీనివాస్‌ తదితరులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. శ్రీనివాస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉదయ్‌ హొళ్ల వాదనలు కొనసాగించారు. ‘‘ఇదే తెరాస 2014లో 23 మంది ఎమ్మెల్యేలను, 2018లో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్‌ నుంచి పార్టీ ఫిరాయించినవారే. ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు చెప్పేవారు ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారు. ఇప్పుడు భాజపా వైపు వేలెత్తి చూపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న సిట్‌కు విశ్వసనీయత లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నవారే దానికి అధిపతి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధిపతి, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఒకరే. తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని స్వయంగా గవర్నరే చెప్పారు. పోలీసు కమిషనర్‌ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి. దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. షర్మిలను కారుతో సహా క్రేన్‌ ద్వారా తరలించిన చర్యకూ ఈయనే సమాధానం చెప్పాలి. 30 మంది పోలీసులు నా క్లయింట్‌ ఇంటిపై దాడి చేసి 41ఎ కింద నోటీసు అంటించారు. అంటించిన నోటీసులను పత్రికలకు జారీ చేసి గౌరవంగా జీవించే, చట్టబద్ధ జీవనానికి ఈ కమిషనర్‌ నేతృత్వం వహిస్తున్న సిట్‌ విఘాతం కలిగించింది’’ అని వివరించారు.

సీఎంకు సిట్‌ సమాచారం ఇవ్వలేదు: ఏఏజీ జె.రామచంద్రరావు

ముఖ్యమంత్రికి, మీడియాకు సిట్‌ సమాచారం ఇవ్వలేదని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. వాదనల సందర్భంగా సీఎం మీడియా సమావేశం వల్ల నష్టమేమిటన్న న్యాయమూర్తి ప్రశ్నకు ఉదయ్‌ హొళ్ల సమాధానమిస్తూ... దర్యాప్తు సమాచారాన్ని సిట్‌ మీడియాకు విడుదల చేయడంతో మీడియా ట్రయల్‌ ప్రారంభమైందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, న్యాయ వ్యవస్థ వ్యక్తుల గౌరవానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూసే బాధ్యత కూడా కోర్టులపైనే ఉందన్నారు. నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తమే కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రికి సమాచారం ఎవరిచ్చారని న్యాయమూర్తి  ప్రశ్నించగా ఏఏజీ సమాధానమిస్తూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇచ్చి ఉండవచ్చన్నారు. సీఎంకు, మీడియాకు సిట్‌ సమాచారం ఇవ్వలేదని, ఇదే విషయమై సిట్‌ ప్రకటన జారీ చేసిందన్నారు. నిందితుల తరఫు వాదనల నిమిత్తం విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో నిందితుల న్యాయవాది మహేష్‌ జఠ్మలానీ శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని