పరిధి దాటి ఏసీబీ కోర్టు ఉత్తర్వులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, డా.జగ్గుస్వామి, బి. శ్రీనివాస్‌లను నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసిందంటూ సిట్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది.

Published : 08 Dec 2022 05:48 IST

తక్షణం రద్దు చేయాలి
హైకోర్టును ఆశ్రయించిన సిట్‌
ప్రతిపాదిత నిందితులకు నోటీసులు
ఈనాడు - హైదరాబాద్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, డా.జగ్గుస్వామి, బి. శ్రీనివాస్‌లను నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసిందంటూ సిట్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని కోరింది. మంగళవారం నాటి ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ... సిట్‌ భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం జస్టిస్‌ డి.నాగార్జున్‌ విచారణ చేపట్టారు. ప్రతిపాదిత నిందితులకు నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షంగా విచారణ చేపట్టలేమన్నారు. నోటీసులు జారీ చేస్తూ దీనిపై గురువారం మొదటి కేసుగా విచారణ చేపడతామన్నారు.

కింది కోర్టు ప్రవర్తన విస్మయకరం: ఏజీ

సిట్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, పీపీ ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఎమ్మెల్యేలకు ఎర కేసులన్నీ ప్రస్తుతం సుప్రీం, హైకోర్టుల ముందున్నాయి. ఈ దశలో సిట్‌ దాఖలు చేసిన మెమోను తిరస్కరించే అధికారం కింది కోర్టుకు లేదు. సుప్రీం, హైకోర్టులు కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయవు. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసిన కింది కోర్టు ప్రవర్తన విస్మయం కలిగిస్తోంది. సిట్‌ దర్యాప్తును కొనసాగించడానికి హైకోర్టు, సుప్రీం కోర్టులే అనుమతించాయి. వాటి ఉత్తర్వులను ధిక్కరించినట్లుగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులున్నాయి. నిందితులు కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్‌లలో పేర్కొన్న అంశాలన్నింటినీ ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుంది. కేసును కొట్టివేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రం దాఖలు చేసిన తరువాతే నిందితుల జాబితాలో పేర్లను తిరస్కరించవచ్చు. దర్యాప్తులో ప్రతి రోజూ కీలకమైనది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లాంటివి దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తాయి. వెంటనే వాటిని రద్దు చేయాలి’’ అని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మెమో దాఖలు చేసినందున ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ‘‘నిందితులుగా చేర్చుతున్నట్లు కోర్టుకు సమాచారం మాత్రమే ఇచ్చాం. మేమెలాంటి అభ్యర్థన చేయలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఈ దశలో ఎవరిని నిందితులుగా చేర్చాలన్నది పోలీసుల ప్రత్యేక హక్కు’’ అని ఏజీ తెలిపారు.

నోటీసులు జారీ చేయకుండా కేసును తేల్చరాదు
-సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రామచందర్‌రావు

శ్రీనివాస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రామచందర్‌రావు వాదనలు వినిపించారు. ‘‘సిట్‌ ఇక్కడ రివిజన్‌ పిటిషన్‌ వేసింది. ఆ కాపీ ఇవ్వకుండా విచారణ చేపట్టడం సరికాదు. ప్రతిపాదిత నిందితుడికి నోటీసులు జారీ చేయకుండా ఈ కోర్టు కేసును తేల్చరాదు’’ అని వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతిపాదిత నిందితులైన బి.ఎల్‌.సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లకు నోటీసులు చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని