యువత పిడికిలి బిగించాలి
మేకిన్ ఇండియా నినాదంతో మోదీ సర్కారు సాధించిందేమీ లేదని.. పెట్టుబడిదారులు దోపిడీ చేసేలా కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎనిమిదేళ్ల నుంచి ఎన్‌పీఏల పేరిట రూ.14 లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని కేంద్రం దోచిపెట్టింది.
దేశ ఆస్తులను కాపాడుకోవాలి
మోదీ హయాంలో పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప.. పేదల సంక్షేమమేదీ!
మేకిన్ ఇండియాతో ఏం సాధించారు?
ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం
జగిత్యాల సభలో కేంద్ర సర్కారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజం
ఈనాడు, కరీంనగర్- న్యూస్‌టుడే, జగిత్యాల: మేకిన్ ఇండియా నినాదంతో మోదీ సర్కారు సాధించిందేమీ లేదని.. పెట్టుబడిదారులు దోపిడీ చేసేలా కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎనిమిదేళ్ల నుంచి ఎన్‌పీఏల పేరిట రూ.14 లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని కేంద్రం దోచిపెట్టింది. 25 లక్షల మంది ఏజెంట్లు, లక్షలాది ఉద్యోగులు ఉండి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సమానంగా ఆస్తులు కలిగిన ఎల్‌ఐసీని కూడా అమ్మేస్తాం.. ప్రైవేటుపరం చేస్తామనేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులు మన డబ్బుతో లక్షల కోట్లతో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, జనరేషన్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చాయి. వాటన్నింటిని నామమాత్రపు ధరలకు షావుకారులకు అప్పజెప్తామంటే మనమెందుకు ఊరుకోవాలి? ఈ అరాచకం ఇదేవిధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యమవుతుందే తప్ప పేద ప్రజల సంక్షేమం కనుమరుగవుతుంది’ అని ఆయన అన్నారు. యువత అంతా ఈ విషయంలో పిడికిలి ఎత్తాలని, దేశ ఆస్తులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ ఉద్యోగులంతా సైనికుల్లా మారాలన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు జగిత్యాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.510 కోట్లతో నిర్మించనున్న వైద్యకళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
పనిచేయని నినాదాలు
‘‘ఒక్క నినాదమన్నా.. సరిగ్గా ఉందా? సబ్‌కా సాథ్ సబ్‌కా విశ్వాస్.. అనేది సబ్‌కా బక్వాస్ అయింది. ఎక్కడైనా వికాసమున్నదా? బేటీ పఢావో బేటీ బచావో.. అంగన్‌వాడీ నిధులు కట్ చేయడమే బేటీ పఢావోనా? నాతో చర్చకు వస్తారా..? ఎన్నాళ్లీ మోసపు నినాదాలు. ఈరోజు ఉత్తర భారతదేశంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు జరగకుండా.. దళితులపై దాడులు జరగకుండా.. ఒక్క రోజైనా గడిచే పరిస్థితి ఉందా? మత పిచ్చిలో పడి పనికిమాలిన వాళ్ల మాటలు నమ్మితే అన్నిరకాలుగా మనం నష్టపోతాం. వీళ్లు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏమీ రాకపోగా 10వేల పరిశ్రమలు దేశంలో మూతపడ్డాయి. ఈ విషయమై ఈ దేశంలో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. పరిశ్రమల్లో పనిచేసే 50 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఏటా 10 వేల మంది బడా పెట్టుబడిదారులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. మోదీ హయాంలో మాటల గారడీ, డంబాచారం తప్ప దేశానికి ఒరిగిందేమీ లేదు.
ఇందుకేనా.. స్వాతంత్య్రం వచ్చింది..?
ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు వెనక్కిపోతాం. ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంట్ సరిగ్గా రాదు. దేశ రాజధాని దిల్లీలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరవాత కడుపునిండా తాగడానికి మంచి నీళ్లు రావు.. కరెంట్ కోతలు తప్పని దుస్థితి నెలకొంది. రక్తం ధారపోసిన సమరయోధులు ఇందుకేనా స్వాత్రంత్య్రాన్ని తెచ్చింది? తెలంగాణ జీడీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.50 లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం పని చేసినట్లు కేంద్రం పనిచేసి ఉంటే జీఎస్‌డీపీ రూ.14.50 లక్షల కోట్లు ఉండేది. కేంద్రంలోని దద్దమ్మ ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే మూడు లక్షల కోట్ల రూపాయల్ని నష్టపోయింది. దీనిపై ఊళ్లలో చర్చపెట్టండి.
అప్రమత్తంగా ఉండాలి..ఆగమాగం కావద్దు!
మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడతాం. గోల్‌మాల్ గోవిందంగాళ్లు.. అడ్డగోలు మాట్లాడేవాళ్లు.. మన మధ్యలో తిరుగుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఆగం కావద్దు. ఆనాడు తెలంగాణ వస్తుందని ఎట్లా చెప్పానో ఈ రోజు కూడా భారతదేశం కూడా మంచిగా మారాలి. దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. ఇక్కడ మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే దేశంలో ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఆయన డైలాగులు బాగానే చెబుతారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినయా పరిశ్రమలు? పిల్లగాళ్లు కాల్చే టపాకాయలు కూడా చైనా నుంచే రావాలా? ఆఖరుకు జాతీయ జెండాలు కూడా అక్కడి నుంచే దిగుమతి అవుతాయా? ఎక్కడ చూసినా చైనా బజార్లు కనిపించడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహిస్తోంది. ఏం జరుగుతోంది..? నేనెవరినో నిందించడం కోసం చెప్పడం లేదు. భారతదేశ భవిష్యత్తు గుర్తించి.. మన దేశం బాగుపడటం గురించి చెబుతున్నా.
జగిత్యాల జిల్లా ఎలా సాధ్యమైంది?
‘జగిత్యాల జిల్లా ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా మనం అనుకోలేదు. ఎలా సాధ్యమైంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది. గతంలో వరద కాలువ నిండేది కాదు. తూములు లేవు. నీళ్ల కోసం రైతులు కరెంట్ మోటార్లు పెడితే అధికారులు వాటిని కాలువలోకి తోసేసిన విషయాలన్నీ నాకు తెలుసు. ఆ వరద కాలువను ఇప్పుడు జీవనదిగా మార్చుకున్నాం. తూములు పెట్టుకున్నాం. మంత్రి గంగుల కమలాకర్ నాతో కొట్లాడి కరీంనగర్ గ్రామీణ మండలంలో వరద కాలువకు తూములు పెట్టించి వందలాది చెరువులను నింపించేలా చొరవ చూపారు.. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి ఇక్కడి బండలింగాపూర్ గ్రామానికి వెళ్లి చెరువులు ఎండిపోయిన తీరును కళ్లారా చూశాం. ఆ ఊళ్లో రాత్రి ఉన్నాను. దుఃఖపడుతూ ప్రజల బాధ చూశాను. అక్కడి ప్రజల కోరిక మేరకు ఆ ఊరిని కొత్త మండలంగా తక్షణమే ప్రకటిస్తున్నాను.
కొండగట్టుకు రూ.100 కోట్లు
తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు, దైవభక్తి ఉన్న ప్రాంతం. కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి హనుమాన్ భక్తులు వేల సంఖ్యను దాటి లక్షల్లో వస్తున్నారు. గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకుంటే 35 ఎకరాలు ఇప్పించాం. కొండగట్టుకు 20 ఎకరాలు ఉంటే.. 384 ఎకరాల స్థలాన్ని అదనంగా ఇచ్చాం. ఈ క్షేత్రానికి రూ.100 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నా. కొద్ది రోజుల్లో స్వయంగా స్థపతులను తీసుకొచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దుతాం.
సీఎం కేసీఆర్
ప్రపంచంలో ఎక్కడా లేదు..!
ఈ దేశంలోనే కాదు.. భూ ప్రపంచంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణనే.! చితికి పోయి ఛిద్ర]మైపోయిన తెలంగాణ రైతులు ఒక దరికి రావాలని.. అప్పులు తీరాలని తీసుకున్న నిర్ణయమిది. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పంటను కొని.. 5 రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు వేసే రాష్ట్రం కూడా మనదే. మరో అయిదు, పది రోజుల్లో రైతుబంధు అందిస్తాం. కేసీఆర్ బతికి ఉన్నంతవరకు రైతు బంధు, బీమా ఆగదు
సీఎం కేసీఆర్
అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
ఈనాడు, కరీంనగర్-న్యూస్‌టుడే, జగిత్యాల: రాష్ట్రం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడేందుకు సమష్టి కృషి కారణమైందని.. అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం జగిత్యాల నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగులు, అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘33 జిల్లాల్లో పరిపాలన వికేంద్రీకరణతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఉద్యోగులు సహకరించారు. ఇందాక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ పురోహితుడు చదివిన మంత్రంలో ఎంతో పరమార్థం దాగుంది. పాలకులు న్యాయమార్గంలో ఈ భూమిని పరిపాలించాలి.అలా జనమంతా సుఖంగా ఉండాలనేది దాని అర్థం. అదేవిధంగా మన తెలంగాణలో పరిపాలనలో అద్భుతమైన విజయాలు సాధించాం. ఈ జగిత్యాల జిల్లాకు చెందిన జీఆర్ రెడ్డి అనే ఆర్థికవేత్త సూచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. 62 వేల కోట్ల రూపాయలున్న బడ్జెట్ను 2.20 లక్షల కోట్లు దాటించాం. కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకుంటున్నాం. రైతుబంధు విషయంలో పరిమితి పెట్టాలని పలువురు చెప్పారు..అయినా నేను ఆ దిశగా ఆలోచించలేదు. 25 ఎకరాలకు పైబడిన వారు తక్కువ మంది రైతులే ఉంటారు. ఉత్సాహంగా పనిచేయడానికి నూతన కలెక్టరేట్ భవనాలు దోహదపడతాయి. సమష్టి కృషితో మరింత ప్రగతి కోసం పనిచేద్దామని సీఎం ఉద్యోగులకు తెలిపారు. ఆర్కిటెక్ట్ ఉషారాణిని అభినందించారు. జగిత్యాల కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లనే రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు కవిత, భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ, కౌశిక్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, రమేశ్‌బాబు, ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజేశంగౌడ్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావులతోపాటు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు వసంత, విజయ, కలెక్టరు గుగులోత్ రవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మోటారుకు బిల్లు కట్టాలని ఎవరైనా అడుగుతున్నారా?
వరదకాలువను సజీవ జలధారగా మారుస్తానని చెప్పిన మాటను నేడు నిజం చేసి చూపించా. 24 గంటలపాటు కరెంట్ను ఇప్పుడు అందుకుంటున్నాం. ఏటా రైతుల విద్యుత్తు బిల్లు కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.13-14 వేల కోట్లను చెల్లిస్తోంది. అసలు మీ మోటారుకు బిల్లు కట్టలేదని అడిగేవాళ్లెవరైనా మీ వద్దకు వచ్చారా? ఎవరూ రారు. కానీ ఇప్పుడు కేంద్రం మోటార్లకు మీటర్లు పెడ్తదట. పెడదామా?
తెలంగాణ..నంబర్‌వన్
16 రాష్ట్రాలో బీడీ కార్మికులున్నారు. వీరికి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఇచ్చినట్లు రూ.2016 పింఛన్‌ను ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కులం, మతం అనే భేదం లేకుండా విద్యనందిస్తున్నాం. తలసరి విద్యుత్తు వినియోగం, తలసరి ఆదాయం, ఆర్థిక వనరులను పెంచుకోవడంతోపాటు అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోంది.
సీఎం కేసీఆర్
నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఆయన ఎర్రవల్లిలోని నివాసం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు బయల్దేరి 12.40 గంటలకు చేరుకుంటారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్ నివాసానికి వెళతారు. అక్కడ భోజనం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు