ఏపీ వాదనకు తెలంగాణ తిరస్కారం

కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రంగా మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కే ఉందన్న వాదనను తెలంగాణ తోసిపుచ్చింది.

Published : 08 Dec 2022 04:59 IST

కృష్ణా మిగులు జలాల వినియోగ అవకాశం తమదేనన్న రాష్ట్రం
బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ షురూ

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రంగా మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కే ఉందన్న వాదనను తెలంగాణ తోసిపుచ్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది తామేనని పేర్కొంది. బుధవారం ప్రారంభమైన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ శుక్రవారం వరకు కొనసాగనుంది. తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న జలసంఘం మాజీ ఛైర్మన్‌ చేతన్‌ పండిట్‌ను ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ న్యాయవాది క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. మిగులు జలాలను దిగువన ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకోవాల్సి ఉంటుందన్న ప్రశ్నకు పండిట్‌ సమాధానమిస్తూ ఉమ్మడి రాష్ట్రం పరిస్థితి దయనీయంగా ఉంటుందనే మిగులు జలాలను ఉపయోగించుకొనే అవకాశాన్ని కృష్ణా ట్రైబ్యునల్‌-1 దానికి కల్పించిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య పరిస్థితిని పరిశీలిస్తే తెలంగాణకు ఇబ్బందులు ఎక్కువన్నారు. అది తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటోందన్నారు. కాబట్టి మిగులు జలాలను వినియోగించుకునే అవకాశం దానికే ఉంటుందన్నారు. కృష్ణా బోర్డు నిర్ణయం ప్రకారం ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలోనే నీటి వినియోగం ఉందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాది పేర్కొనగా, ఈ సమావేశంలోనే దాన్ని తెలంగాణ వ్యతిరేకించిందని పండిట్‌ బదులిచ్చారు. ఇదే అంశంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ కూడా రాశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని