Vikarabad: టైమ్‌ మిషన్‌ కాదు.. హీలియం బెలూన్‌

బుధవారం ఉదయం 6.30 గంటలు. ఆకాశంలో ఒక తెల్లని గుండ్రపు ఆకారంలో ఓ పెద్ద పరికరం ఎగురుతోంది. ఆకాశంలో ఏదో వింత జరుగుతోందని, వింత వస్తువేదో ప్రయాణిస్తోందంటూ ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు.

Updated : 08 Dec 2022 07:38 IST

వాతావరణంలో మార్పులపై అధ్యయనం కోసమే ప్రయోగించాం
వెల్లడించిన టీఐఎఫ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మర్పల్లి: బుధవారం ఉదయం 6.30 గంటలు. ఆకాశంలో ఒక తెల్లని గుండ్రపు ఆకారంలో ఓ పెద్ద పరికరం ఎగురుతోంది. ఆకాశంలో ఏదో వింత జరుగుతోందని, వింత వస్తువేదో ప్రయాణిస్తోందంటూ ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు. అది ఆదిత్య 369 సినిమాలోని టైమ్‌ మిషన్‌ ఆకారంలో ఉండటంతో టైమ్‌ మిషన్‌ సంచరిస్తోందంటూ జరిగిన ప్రచారం నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తమైంది. చివరికి అది వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని మొగిలిగుండ్ల వద్ద కిందకు దిగింది. ఆ క్రమంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడ గుమిగూడారు. వారిచ్చిన సమాచారం మేరకు మర్పల్లి తహసీల్దారు శ్రీధర్‌, మోమిన్‌పేట సీఐ వెంకటేశం తదితరులు దాన్ని పరిశీలించారు. ఈ విషయమై టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) కేంద్రం శాస్త్రవేత్తలు స్పందించారు. అది టైమ్‌ మిషన్‌ కాదని, భారీ హీలియం గ్యాస్‌ బుడగ అని తెలిపారు. ‘వాతావరణ మార్పులపై అధ్యయనానికి స్పెయిన్‌ దేశం సహకారంతో కేంద్ర అణుశక్తి శాఖ, ఇస్రో సమన్వయంతో టీఐఎఫ్‌ఆర్‌ ఈ ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ నుంచి హీలియం గ్యాస్‌ బుడగను ప్రయోగించాం. దాదాపు 35-40 కి.మీ. ఎత్తులో తూర్పు దిశగా అది ప్రయాణించింది. బరువు సుమారు 800 కిలోల వరకు ఉంటుంది. దానికి అనుసంధానంగా శాస్త్రీయ పరిశోధన పరికరాన్నీ అమర్చాం. జీపీఎస్‌ ఆధారంగా దాని గమనాన్ని తెలుసుకున్నాం. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం మొగలిగండ్లలోని ప్రసాదరావు పొలంలో ఉదయం 9.30 గంటలకు అది కిందకు దిగింది. ఆ సమయంలో హీలియం బెలూన్‌ నుంచి పరిశోధక పరికరం విడిపోయింది. పరికరం వివరాలు తెలియజేసేందుకు వీలుగా దానిపై ఫోన్‌ నంబర్లు రాసి ఉంచాం’’ అని వారు వెల్లడించారు. జీపీఎస్‌ సాయంతో టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన ల్యాబ్‌ సహాయకులు అక్కడికి చేరుకుని పరికరాలను వేరుచేసి ప్రత్యేక వాహనంలో తరలించినట్టు చెప్పారు.

గుర్తిస్తే సమాచారం ఇవ్వండి

నవంబరు నుంచి బెలూన్లతో వరుస పరిశోధనలు చేపట్టనున్నట్లు టీఐఎఫ్‌ఆర్‌ బెలూన్‌ ఫెసిలిటీ కేంద్రం శాస్త్రవేత్త సునీల్‌కుమార్‌ గత నెలలో ప్రకటించారు. విశాఖపట్నం, సోలాపుర్‌ మార్గాలతోపాటు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో ఇవి కిందకు దిగే అవకాశం ఉందని, వాటిని గుర్తిస్తే వెంటనే స్థానిక తహసీల్దారు, పోలీసులు లేదా తమ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు