సీపీఐ రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్‌ భవన్‌’ ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డిలతో పాటు వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 08 Dec 2022 05:11 IST

ఖైరతాబాద్‌ కూడలిలోనే శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
తోపులాటల మధ్యే ముందుకెళ్లే ప్రయత్నంలో పలువురికి గాయాలు

ఖైరతాబాద్‌, నాంపల్లి, న్యూస్‌టుడే: గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్‌ భవన్‌’ ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డిలతో పాటు వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుతో వివిధ జిల్లాల నేతలు, కార్యకర్తలు  బుధవారం హైదరాబాద్‌ తరలివచ్చారు. ఉదయం ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్న వారు.. అక్కణ్నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి వెళ్లేందుకు నిర్ణయించారు. అప్పటికే ఖైరతాబాద్‌ కూడలిలో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీపీఐ శ్రేణులు ప్రతిఘటించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఆందోళనకారులు బారికేడ్లను దాటుకుని ప్రధాన కూడలి వరకూ వచ్చారు. అక్కడా పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్‌ భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దుచేసే దాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ముట్టడిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్‌.బాలమల్లేశ్‌, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కళవేన శంకర్‌, బాలనర్సింహ, బాగం హేమంత్‌రావు, ఇ.టి.నరసింహ, వివిధ జిల్లాల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అరెస్టయిన సీపీఐ నాయకులు, కార్యకర్తలను నాంపల్లి ఠాణాకు తరలించగా అక్కడ వారిని పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు. బుధవారం నారాయణ జన్మదినం కావడంతో కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌లోనే కేకు కోశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని