తెలంగాణలో రైల్వే ప్రగతికి కృషి

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలో రైల్వేల ప్రగతికి కృషి చేస్తోందని.. యూపీఏ హయాంతో పోలిస్తే నిధుల కేటాయింపు, నిర్మించిన రైల్వేలైన్ల నిడివి భారీగా పెరిగిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 08 Dec 2022 05:34 IST

విశాఖ రైలు పాలమూరుకు, జైపుర్‌ రైలు కర్నూలు వరకు పొడిగింపు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలో రైల్వేల ప్రగతికి కృషి చేస్తోందని.. యూపీఏ హయాంతో పోలిస్తే నిధుల కేటాయింపు, నిర్మించిన రైల్వేలైన్ల నిడివి భారీగా పెరిగిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తే..కేసీఆర్‌ ప్రభుత్వం అంతకుమించి వ్యవహరిస్తోందన్నారు. రైల్వేతో కుదుర్చుకున్న ఒప్పందాలకు తగ్గట్లు నిధులు, భూమి కేటాయించటం లేదని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘2009-14 మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త రైలుమార్గం- 87 కి.మీ. మాత్రమే. 2014-22 మధ్య అది ఏకంగా 444 కి.మీ., 2014-15 నుంచి 2022-23 నడుమ దాదాపు రూ.16వేల కోట్ల నిధులను తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేటాయించింది. ఎనిమిదేళ్లలో రూ.3847 కోట్ల వ్యయంతో 444 కి.మీ. మార్గం పూర్తిచేసింది. ఎనిమిది ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు రూ.12,160 కోట్ల వ్యయంతో 1,201 కి.మీ. నిడివితో నిర్మిస్తున్న ఐదు ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 2,407 కి.మీ. పొడవైన 33 ప్రాజెక్టుల సర్వే జరుగుతోంది. ఎంఎంటీఎస్‌ రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం తన వాటా రూ.275 కోట్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోంది’ అని కిషన్‌రెడ్డి అన్నారు. డిసెంబరు 1న తాను కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్‌ను కలిశాక మొత్తం ఐదు రైళ్లను పొడిగించారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆ వివరాలు..

* జైపుర్‌-సికింద్రాబాద్‌ రైలు (19713/19714): కర్నూలు వరకు పొడిగింపు. కాచిగూడ, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల స్టేషన్లలో ఆగుతుంది.

* విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌(12861/12862): మహబూబ్‌నగర్‌ వరకు పొడిగింపు. షాద్‌నగర్‌, జడ్చర్లలో అదనపు స్టాపులు.

* కరీంనగర్‌-నిజామాబాద్‌ (77259/77260): బోధన్‌ వరకు  పొడిగింపు. జానకంపేట, బోధన్‌లో స్టాపేజీలు...వీటితో పాటు హైదరాబాద్‌-హడప్సర్‌(పుణె) రైలు కాజీపేట వరకు, పర్బనీ-నాందేడ్‌-తాండూరు రైలు రాయచూరు వరకు పొడిగింపు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని