BRS: తెరాస ఇక భారాస

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)గా మారింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజముద్ర వేసింది.

Updated : 09 Dec 2022 08:59 IST

భారత్‌ రాష్ట్ర సమితికి ఈసీ రాజముద్ర

సీఎం కేసీఆర్‌కు అధికారిక లేఖ

నేడు తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ కార్యక్రమం

నేటి నుంచి భారాస గానే పరిగణన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)గా మారింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజముద్ర వేసింది. గురువారం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ పంపింది. దీనికి అనుగుణంగా శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో భారాస ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈసీ లేఖకు ఆమోదం తెలుపుతూ సంతకం చేసి అధికారికంగా పంపించనున్నారు. ఆ వెంటనే భారాస పేరు అమల్లోకి వస్తుంది. భారాస ఆవిర్భావ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీలు, డీసీఎమ్మెస్‌లు, రైతుబంధు సమితుల ఛైర్మన్లు, ఇతర ముఖ్యనేతలను సీఎం ఆహ్వానించారు.

జెండా రూపకల్పన..

భారత్‌ రాష్ట్ర సమితి జెండాను గురువారం రాత్రి సీఎం ఖరారు చేశారు. ప్రాంతీయ పార్టీగా తెరాసకు తెలంగాణ ముఖచిత్రంతో జెండా ఉంది. భారత్‌ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించినందున భారతదేశ చిత్ర పటంతో జెండాను రూపొందించారు. గులాబీ రంగు యథాతథంగా ఉంటుంది. భారాస ఆవిర్భావాన్ని సూచిస్తూ సీఎం శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటల తర్వాత పార్టీ జెండాను ఎగురవేస్తారు. పార్టీ గుర్తుగా కారు కొనసాగుతుంది.

దసరా రోజున తీర్మానం

ఈ ఏడాది అక్టోబరు 5న విజయదశమి రోజున తెలంగాణభవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్ష, కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది తెరాస ప్రతినిధులు దానిపై సంతకం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని కేసీఆర్‌ చదివి వినిపించారు. ఆ వెంటనే ఆయన దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పార్టీ సీనియర్‌ నేత, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఈ లేఖను అక్టోబరు ఆరో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ తర్వాత నెలరోజులకు ఈసీ దీనిపై తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు సమాచారం పంపింది. పార్టీ పేరు మార్పిడిపై బహిరంగ ప్రకటన జారీ చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగా అదే నెల ఏడో తేదీన పేరు మార్పిడిపై కేసీఆర్‌ బహిరంగ ప్రకటన చేశారు. అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఈసీ తెరాసను భారాసగా మార్చేందుకు నిర్ణయించి సీఎంకు లేఖ రాసింది. నిబంధనల మేరకు ఈసీ లేఖకు అంగీకారం తెలియజేయాలి. ఈ మేరకు కేసీఆర్‌ ఆమోదాన్ని తెలుపుతూ శుక్రవారం లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపుతున్నారు. అది ఈసీకి చేరిన వెంటనే, అధికారికంగా భారాసను గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

ఆనాడు చెప్పిన ముహూర్తానికే..

పార్టీ పేరు మార్పుపై దసరా నాడు చేసిన తీర్మానాన్ని వెంటనే ఈసీ ఆమోదిస్తుందని,  భారాస పేరిటే మునుగోడులో పోటీ చేస్తామని, డిసెంబరు 9న మధ్యాహ్నం 1.20 గంటల ముహూర్తానికి దిల్లీలో భారీఎత్తున భారాస ఆవిర్భావ సభను నిర్వహిస్తామని అదే రోజు సీఎం ప్రకటించారు. అయితే ఈసీ అనుమతి ప్రక్రియలో జాప్యం దృష్ట్యా గురువారం ఆమోదం పొందింది. గతంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరోజే సమయం ఉండటంతో సీఎం తెలంగాణభవన్‌లో భారాస ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

తెరాసను భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ విడుదల చేసిన లేఖలో... పార్టీ  కార్యాలయ చిరునామాలో రాష్ట్రం పేరును తెలంగాణ అని కాకుండా ఆంధ్రప్రదేశ్‌ అని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని