ఏపీకి కేటాయించిన 50 వేల సౌర పంప్‌సెట్లు వెనక్కి

పీఎం కుసుమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల వ్యవసాయ మోటార్లను సౌరవిద్యుత్తు కిందకి తీసుకురావాలని నిర్ణయించినప్పటికీ పథకం అమలులో పురోగతి లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో  వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు.

Published : 09 Dec 2022 05:40 IST

‘పీఎం కుసుమ్‌’ అమలులో పురోగతి లేకపోవడమే కారణం  

ఈనాడు, దిల్లీ: పీఎం కుసుమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల వ్యవసాయ మోటార్లను సౌరవిద్యుత్తు కిందకి తీసుకురావాలని నిర్ణయించినప్పటికీ పథకం అమలులో పురోగతి లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో  వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి డిమాండ్‌ రావడంతో ప్రస్తుతం 50 వేల వ్యవసాయ మోటార్లను పీఎం-కుసుమ్‌ కాంపోనెంట్‌-సి పథకం కింద సౌరవిద్యుత్తు పరిధిలోకి తీసుకురావడానికి 2021 మార్చిలో కేంద్రం అనుమతిచ్చింది. అయితే పథకం అమలులో పురోగతిలో లేకపోవడంతో ఇచ్చిన అనుమతులను 2022 ఏప్రిల్‌లో ఉపసంహరించుకుంది. కాంపోనెంట్‌-సి కింద సౌర విద్యుత్తు మోటార్లను కలిగిన రైతులు తమ వద్ద మిగిలే విద్యుత్తును డిస్కంలకు విక్రయించుకునే వెసలుబాటు ఉంది. ఇప్పటికే రాజస్థాన్‌, కేరళలో వ్యవసాయ మోటార్లను ఈ పథకం కింద సౌరశక్తి పరిధిలోకి తెచ్చారు. అక్కడి రైతులు డిస్కంలకు అమ్మే మిగులు విద్యుత్తు యూనిట్‌కు రాజస్థాన్‌లో రూ.3.44, కేరళలో రూ.3.22 చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో 1,53,231 పంపుసెట్లను సోలార్‌ పరిధిలోకి తెచ్చారు. వీటిలో అత్యధికంగా రాజస్థాన్‌లో 50,692 మోటార్లు ఉన్నాయి’ అని కేంద్రమంత్రి వెల్లడించారు.

ఏపీలో పట్టణ ఇళ్లు 30% మాత్రమే పూర్తి

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద 2015 నుంచి ఇప్పటివరకు ఏపీకి కేటాయించిన ఇళ్లలో 30% మాత్రమే పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 20,74,770 ఇళ్లు కేటాయించగా 19,08,828 మొదలవగా... 6,32,330 మాత్రమే పూర్తయినట్లు చెప్పారు. తెలంగాణకు కేటాయించిన 2,49,467 ఇళ్లలో 2,11,992 (84.97%), దేశవ్యాప్తంగా 1.20 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తే 64.60 లక్షల ఇళ్లు (53%) పూర్తయినట్లు వివరించారు.

రూ.12 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి 2022-23లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.20,208 కోట్ల విలువైన హైవేల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని లక్ష్యంగా ఉందన్నారు. ఈ ఏడాది రహదారుల నిర్వహణకు రూ.213 కోట్లు, సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.408 కోట్లు కేటాయించామన్నారు. ఇందులో రూ.345 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని