Nanda Kumar: వెలుగులోకి నందు అక్రమాల చిట్టా!

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ అలియాస్‌ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది.

Updated : 12 Dec 2022 08:28 IST

పదుల సంఖ్యలో చెల్లని చెక్కుల గుర్తింపు
పూజలతో ప్రముఖులను బుట్టలో వేసుకొని లబ్ధి పొందినట్లు సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ అలియాస్‌ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది. అతడి బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విశ్లేషణలో.. పలువురితో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నందు ఇచ్చిన చెక్కులు పదుల సంఖ్యలో బౌన్స్‌ అయినట్లు ఇప్పటికే సిట్‌ గుర్తించినట్లు తెలిసింది. నందుతో గతంలో ఇబ్బందులకు గురైన బాధితులు.. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములుగా ఉండి విబేధాల కారణంగా బయటికి వచ్చినవారు, ఆయనతో ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చే ఆధారాలను పరిశీలిస్తూ నందుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

తెరపైకి గుట్కా సంస్థ వ్యవహారం

నందు ఏడు వ్యాపార సంస్థలను నిర్వహించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అతడి మాయమాటలతో మోసపోయినట్లు ఓ గుట్కా సంస్థ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గతంలో ఆ సంస్థ ట్రేడ్‌మార్క్‌పై వివాదం తలెత్తగా.. నిర్వాహకులతో మాట కలిపిన నందు, సంస్థ నిర్వహణ సరిగా లేదని.. దాన్ని అమ్మేందుకు రూ.కోట్లలో డీల్‌ మాట్లాడదామని చెప్పి మోసగించినట్లు సమాచారం. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది.

నందు జాబితాలో ఏడుగురు స్వామీజీలు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నందకుమార్‌తో పాటు రామచంద్రభారతి, సింహయాజి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. రామచంద్రభారతి, సింహయాజిలే కాకుండా నందు జాబితాలో మరో ఏడుగురు స్వామీజీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పేరున్న రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఎంచుకోవడం.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామీజీలతో పూజలు చేయించడాన్ని నందు వ్యాపకంగా పెట్టుకున్నట్లు గుర్తించారు. స్వామీజీలు హైదరాబాద్‌ వచ్చేందుకు విమాన టికెట్లను బుక్‌ చేయడం.. విమానాశ్రయం నుంచి కారులో తీసుకురావడం.. హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వడం.. పూజల సందర్భంగా తొలుత ప్రముఖుల తరఫున తానే స్వామీజీలకు పెద్దఎత్తున దక్షిణ సమర్పించడం.. తర్వాత అదను చూసి వారితో పనులు చేయించుకోవడం వంటి వ్యవహారాలు భారీగానే జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఏమైనా మోసాలు చోటుచేసుకున్నాయా? అని ఆరా తీసే పనిలో సిట్‌ నిమగ్నమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని