Adilabad: చిన్న వయసులోనే అరుదైన వ్యాధి: చదువుకు దూరమై.. భవిత ఛిద్రమై..

ఈ విద్యార్థి భవిష్యత్తును ఎముకల అరుగుదల వ్యాధి చిదిమేసింది. చిన్న వయసులోనే వ్యాధి లక్షణాలు బయటపడటంతో నడవలేక చదువుకు దూరమయ్యాడు.

Updated : 19 Dec 2022 12:34 IST

ఈ విద్యార్థి భవిష్యత్తును ఎముకల అరుగుదల వ్యాధి చిదిమేసింది. చిన్న వయసులోనే వ్యాధి లక్షణాలు బయటపడటంతో నడవలేక చదువుకు దూరమయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన అండ్రెడ్డి లింగారెడ్డి, పుష్పలత దంపతుల కుమారుడు లోకేష్‌రెడ్డి(19) మూడో తరగతి చదువుతున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వైద్యునికి చూపించారు. కుడికాలులో ఎముకల బలహీనత అని చెప్పడంతో మందులు వాడారు.

అలా ఆ విద్యార్థి ఇబ్బంది పడుతూనే 8వ తరగతి వరకు చదివాడు. నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చూపించగా కీళ్లవాతంతో పాటు కుడి కాలుకు ఎముకల అరుగుదల వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఉన్న రెండెకరాల భూమిని విక్రయించి వైద్యం కోసం మూడేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటూ అక్కడే కూలి పనులు చేస్తూ కుమారుడికి చికిత్స చేయిస్తున్నారు.

ఎముకల అరుగుదలను నిరోధించడానికి ప్రతి నెలా రూ.32 వేల ఇంజెక్షన్‌ ఇప్పిస్తున్నారు. శస్త్రచికిత్స చేయిస్తే వ్యాధి నయమవుతుందని.. ఇందుకు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. మానవతావాదులు, దాతలు స్పందించి కుమారుడికి కొత్త జీవితాన్ని అందించాలని వేడుకుంటున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌;
న్యూస్‌టుడే, బేల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని