Tourist Visa: పర్యాటక వీసాకు పచ్చజెండా

తొలిసారి అమెరికా వెళ్లాలనుకునేవారికి తీపి కబురు! పర్యాటక వీసా ఇంటర్వ్యూ తేదీల స్లాట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. జనవరి తరవాత పర్యాటక వీసా(బి1/బి2) స్లాట్లు విడుదలవుతాయని అమెరికా ఆశావహులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

Published : 30 Dec 2022 08:45 IST

జనవరి నుంచి మార్చి వరకు స్లాట్ల విడుదల
హైదరాబాద్‌ కాన్సులేట్‌లో పరిమిత సంఖ్యలోనే..

ఈనాడు, హైదరాబాద్‌: తొలిసారి అమెరికా వెళ్లాలనుకునేవారికి తీపి కబురు! పర్యాటక వీసా ఇంటర్వ్యూ తేదీల స్లాట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. జనవరి తరవాత పర్యాటక వీసా(బి1/బి2) స్లాట్లు విడుదలవుతాయని అమెరికా ఆశావహులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా గురువారం స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోని అన్ని పనిదినాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా స్లాట్లను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో పరిమిత సంఖ్యలో విడుదలైనట్లు పలువురు కన్సల్టెంట్లు ‘ఈనాడు’కు తెలిపారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి మూడో వారం నుంచి వీసా ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. అత్యవసరమైన వారికి ప్రాధాన్య క్రమంలో వీసా ప్రక్రియ నిర్వహించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పర్యాటక వీసాల పునరుద్ధరణ విషయంలో ఇంటర్వ్యూలను మినహాయించింది. గడువు ముగిసి 48 నెలల్లోపు అయినవారి వీసాల పునరుద్ధరణకు వీలుగా డ్రాప్‌బాక్స్‌ సదుపాయం కల్పించింది. ప్రస్తుతం విద్యార్థి వీసాల హడావుడి తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తొలిసారి అమెరికా వెళ్లేవారికి ప్రాధాన్యమిస్తామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గతంలోనే ప్రకటించింది.

హైదరాబాద్‌లో నిమిషాల వ్యవధిలోనే..

ఇంటర్వ్యూ తేదీల స్లాట్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశావహులు అవి విడుదలైందే తడవుగా ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ పరిధిలోని స్లాట్లు నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. పరిమిత సంఖ్యలో విడుదల చేయటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి ముంబై కాన్సులేట్‌ పరిధిలో స్లాట్లు లభించాయి. మరికొందరికి దిల్లీలో ఇంటర్వ్యూ తేదీలు లభించినట్లు సమాచారం. దేశంలోని ఏ కాన్సులేట్‌ పరిధిలోనైనా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు వెసులుబాటు ఉండటంతో ఇతర ప్రాంతాలపైనా దరఖాస్తుదారులు దృష్టి సారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని