గజాల్లో విక్రయం.. హక్కులకు మార్గం

ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేయకముందు కొంత భూమిని చదరపు గజాల్లో విక్రయించడంతో మిగిలిన భూమికి పూర్తిస్థాయి హక్కులు దక్కని రైతులకు రెవెన్యూశాఖ మార్గం సుగమం చేసింది.

Updated : 05 Jan 2023 05:10 IST

దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశం
ధరణి పోర్టల్లో కొత్త ఐచ్ఛికం ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేయకముందు కొంత భూమిని చదరపు గజాల్లో విక్రయించడంతో మిగిలిన భూమికి పూర్తిస్థాయి హక్కులు దక్కని రైతులకు రెవెన్యూశాఖ మార్గం సుగమం చేసింది. సాగుభూమికి పట్టా పాసుపుస్తకం వచ్చి, ధరణిలో పేరు నమోదై ఉన్నప్పటికీ డిజిటల్‌ సంతకం పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతోందంటూ జిల్లాల్లో వస్తున్న దరఖాస్తుల విషయాన్ని కలెక్టర్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పట్టా పాసుపుస్తకాల సవరణకు సంబంధించి ఏర్పాటు చేసిన టీఎం-33 మాడ్యూల్లో ‘సోల్డవుట్‌ కేసెస్‌’ పేరుతో ఐచ్ఛికం అందుబాటులోకి తీసుకొచ్చారు. పోర్టల్‌ ఏర్పాటుకు ముందు రైతులు తమ వద్ద ఉన్న భూమిలో కొంత భాగాన్ని నివాస స్థలాల కోసం చదరపు గజాల్లో విక్రయించిన పరిస్థితులు చాలాచోట్ల ఉన్నాయి. ఆ రైతుల ఖాతాల్లో ఉన్న భూమి నుంచి ఇలా గజాల చొప్పున విక్రయించిన భూమిని తొలగించాల్సి ఉండగా అది పూర్తికాలేదు. మిగిలిన సాగు భూమి, విక్రయించిన విస్తీర్ణం ఒకే సర్వే నంబరులో ఉండిపోయాయి. దీంతో సాగుభూమికి జారీచేసిన పట్టా పాసుపుస్తకంలో డిజిటల్‌ సంతకం పెండింగ్‌లో ఉంది. దీనివల్ల ఆ రైతు భూమిని విక్రయించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఐచ్ఛికం ఏర్పాటు చేయడంతో చదరపు గజాల్లో విక్రయించిన స్థలాన్ని సాగు భూమి నుంచి వేరు చేసి ఉప సర్వే నంబరు కేటాయించనున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కానుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీసీఎల్‌ఏ కలెక్టర్లకు తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు.

నోషనల్‌ ఖాతా సమస్యలు పరిష్కరించండి: సాగులో లేని, ఇతర కారణాలున్న కొన్ని భూములను ప్రత్యేక ఖాతా (నోషనల్‌) నంబర్లలో చేర్చి పక్కన పెట్టిన పరిస్థితులు జిల్లాల్లో ఉంటే వాటిని పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లకు సూచించారు. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) సమయంలో రైతులు సాగు చేయని భూములను రెవెన్యూ అధికారులు ఒక ప్రత్యేక ఖాతా నంబరు సృష్టించి దానిలో నమోదు చేశారు. ఖమ్మం జిల్లాలో 99999, మరికొన్ని జిల్లాల్లో శ్రీశ్రీ అని ఇలా ఖాతాల పేర్లు సృష్టించారు. కొంతభూమికి పట్టా వచ్చి, సాగులో లేని భూములకు ఇప్పటికీ పట్టాలు రాలేదంటూ రైతులు తిరుగుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇలాంటి కేసులు పరిష్కరించారని, మిగిలిన జిల్లాల్లోనూ నోషనల్‌ సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎస్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని