Hyderabad: మోకిలలో కొత్త లేఅవుట్
అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో మరో భారీ లేఅవుట్‌కు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దాదాపు 160 ఎకరాల్లో మోకిలలో లేఅవుట్‌ను తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
160 ఎకరాల్లో అభివృద్ధికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక
ప్రారంభ ధర గజానికి రూ.20 వేల వరకు..
ఈనాడు, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో మరో భారీ లేఅవుట్‌కు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దాదాపు 160 ఎకరాల్లో మోకిలలో లేఅవుట్‌ను తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోకాపేటకు సమీపంలో ఈ లేఅవుట్ రానుండటంతో కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారుల నుంచి భారీ స్పందన ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రారంభ ధరే ప్రతి చదరపు గజానికి రూ.20 వేలు వరకు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మోకిల వద్ద లేఅవుట్ కోసం హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతుల వాటా విషయంలో లెక్కలు తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఎకరానికి 600 గజాల వంతున అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించేందుకు హెచ్‌ఎండీఏ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై రైతుల నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్లు చెబుతున్నారు. దీనిపై ఒక స్పష్టత వస్తే.. వెంటనే లేఅవుట్ పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టనుంది. అనంతరం ఆన్‌లైన్ వేలంలో ప్లాట్లను విక్రయించనున్నారు. కనీసం 200-300 చదరపు గజాల వంతున ప్లాట్లను అందుబాటులోకి తేనున్నారు. గతంలో తుర్కయాంజాల్, తొర్రూర్‌లో చేపట్టిన ప్లాట్లవేలానికి అనూహ్యస్పందన వచ్చింది. మొత్తం రూ.200 కోట్లు వరకు ఆదాయం రావడంతో అదే ఊపుతో వివిధ ప్రాంతాల్లో గతంలో మిగిలిన ఉన్న స్థలాలతోపాటు కొత్తగా లేఅవుట్లు వేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
త్వరలో పూర్తి
అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే కోకాపేట లేఅవుట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో ఇక్కడ భూములను హెచ్‌ఎండీఏ విక్రయించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.400 కోట్లతో ఈ లేవుట్‌లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి సులువుగా అవుటర్ రింగ్‌రోడ్డుపైకి చేరుకునేలా ఇంటర్‌ఛేంజ్ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఈ లేఅవుట్‌లో ఎకరా రూ.14 కోట్లు వరకు పలికింది. పనులు పూర్తయితే కోకాపేట ప్రాంతం చుట్టూ రూపురేఖలు మారిపోనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.