EPFO: వడ్డీ ఉందా.. లేదా?
దేశంలో దాదాపు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల వడ్డీజమపై గందరగోళం నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కార్మికులు, ఉద్యోగుల భవిష్యనిధి నిల్వలపై 8.1 శాతం చొప్పున వడ్డీ ఖరారు చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు.
పీఎఫ్ వినియోగదారుల్లో గందరగోళం
గత ఏడాదికి జమ చేయని ఈపీఎఫ్‌వో
పరిమితి దాటిన చందా.. పన్ను, పన్నేతరగా విభజన
ఈనాడు, హైదరాబాద్: దేశంలో దాదాపు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల వడ్డీజమపై గందరగోళం నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కార్మికులు, ఉద్యోగుల భవిష్యనిధి నిల్వలపై 8.1 శాతం చొప్పున వడ్డీ ఖరారు చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. 2022-23 ఏడాదికి వడ్డీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏడాదికి ఉద్యోగి రూ.2.5 లక్షలకు మించి చందా జమచేస్తే.. అదనపు జమకు లభించే వడ్డీపై పన్ను విధించేందుకు వీలుగా 2021-22 ఏడాది నుంచి పాస్‌బుక్‌లో పన్ను, పన్నేతర జమ విభాగాలను విభజించింది.
కొత్త పాస్‌బుక్‌లో కానరాని జమ
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఉద్యోగి భవిష్యనిధి నిల్వలపై ఆర్థిక సంవత్సరం ముగిసిన మరుసటి నెలలో (ఏప్రిల్ లేదా మే నాటికి) వడ్డీ జమచేసి, నిల్వల వివరాలు చందాదారుడికి చెప్పాలి. కానీ గత ఆరేళ్లుగా భవిష్యనిధి నిల్వలపై వడ్డీ చెల్లింపు సకాలంలో జరగడం లేదు. రెండేళ్ల కిందటి వరకు ఆర్థికశాఖ అనుమతి పేరిట జాప్యం చేస్తూ వచ్చారు. గడిచిపోయిన ఆర్థిక సంవత్సరానికి అక్టోబరు, నవంబరులో వడ్డీ జమ చేసేందుకు ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలిస్తూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ చెల్లించేందుకు మే నెలలోనే ఈపీఎఫ్‌వో సర్క్యులర్ జారీ చేసినా.. ఖాతాల్లో అది జమ అయిన దాఖలాలు లేవు. వడ్డీని ఖాతాల్లో జమ చేశామని, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు పూర్తయిన వెంటనే వివరాలు కనిపిస్తాయని భవిష్యనిధి అధికారులు రెండు నెలల కిందట చెప్పినా ఫలితం లేదు.
పాత పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిందే...
తాజాగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరగడంతో ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్‌లో చందాదారులంతా తప్పనిసరిగా పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిందే. పాత పాస్‌వర్డ్‌తో లాగిన్ కాగానే.. పాస్‌వర్డ్ మార్చుకోవాలని సూచన వస్తుంది. ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే కొత్త పాస్‌వర్డ్ నమోదుకు అవకాశం లభిస్తుంది. ఆ తరువాతే పోర్టల్‌లో సేవలు పొందేందుకు వీలుంటుంది. పాస్‌వర్డ్ మార్చుకున్న ఆరుగంటల తరువాతే ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పరిశీలనకు అవకాశం లభిస్తుంది.
అర్హులైన వారికి అందుబాటులో అధిక పింఛను ఆప్షన్
సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్‌వో కొందరు చందాదారులకు అధిక పింఛను ఆప్షన్‌ను కల్పిస్తూ డిసెంబరులో నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2014 సెప్టెంబరు 1కి ముందు ఉద్యోగి లేదా కార్మికుడు పదవీ విరమణ చేసి గరిష్ఠ పరిమితికి మించి వేతనం పొందుతూ చట్టంలోని పేరానెం.26(6) ప్రకారం అధిక వేతనంపై భవిష్యనిధి చందా చెల్లించాలి. దీంతో పాటు చట్టంలోని పేరా నెం 11(3) సవరణకు ముందుగా యజమానితో కలిసి సంయుక్త ఆప్షన్ ఇవ్వాలి. ఈ ఆప్షన్ పీఎఫ్ అధికారులు తిరస్కరించి ఉండాలి. ఈ మూడు అర్హతలు కలిగిన పింఛనుదారులు మాత్రమే అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అర్హులైనవారంతా ఆన్‌లైన్లో ఆప్షన్ నమోదుకు వీలుగా ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్‌లో గురువారం నుంచి ప్రత్యేక ఏర్పాటు చేసింది. సంబంధిత ఆన్‌లైన్ అప్లికేషన్ లింకుపై క్లిక్ చేస్తే దరఖాస్తు తెరుచుకుంటుంది. ఇందులో పీపీవో (పింఛను చెల్లింపు ఆర్డర్) నంబరు, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నంబరు నమోదు చేయాలి. అనంతరం వచ్చిన ఓటీపీ నంబరు ఎంటర్ చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు