బదిలీలు ముగిసే వరకు సెలవులు ఇవ్వొద్దు

బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయులు నిత్యం హైదరాబాద్‌ వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

Updated : 25 Jan 2023 04:18 IST

పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో డీఈఓల ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయులు నిత్యం హైదరాబాద్‌ వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం సూచనల మేరకు బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వొద్దని కొన్ని జిల్లాల్లో డీఈఓలు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ దంపతులు మౌనదీక్షకు దిగడం, 317 జీఓ బాధిత ఉపాధ్యాయులు ప్రగతిభవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సోమవారం డీఈఓల సమావేశంలో చర్చ జరిగింది. టీచర్లు హైదరాబాద్‌ రాకుండా చూడాలని, వారికి సెలవులు ఎందుకు ఇస్తున్నారని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రశ్నించినట్లు తెలిసింది. ఈక్రమంలో టీచర్లు లిఖితపూర్వకంగా సెలవుపత్రాన్ని రాసి... హెచ్‌ఎంలు/ఎంఈఓల అనుమతి తీసుకొని రావాలని, లేకుంటే సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పలువురు డీఈఓలు ఆదేశాలిచ్చారు. నిజామాబాద్‌ డీఈఓ అయితే బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యేవరకు సెలవులు ఇవ్వరాదని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని