ఇంటర్‌లో కొత్తగా సీఈఏ గ్రూపు

ఇంటర్‌మీడియట్‌ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు.

Updated : 25 Jan 2023 04:21 IST

అకౌంటెన్సీ ప్రధానంగా రూపకల్పన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ విద్యలో కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్‌, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ‘‘ఇంటర్‌స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందిస్తున్నాం.  బోర్డు సమావేశం ఆమోదించింది. వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి అందుబాటులోకి తెస్తాం’’ అని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. చివరిసారిగా.. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గణితం, ఆర్థికశాస్త్రం, కామర్స్‌ సబ్జెక్టుల సమ్మేళనంతో ఎంఈసీ గ్రూపు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత నూతన గ్రూపు రాలేదు. ఉన్న కోర్సుల్లోని సబ్జెక్టుల సిలబస్‌ను మాత్రం కాలానుగుణంగా మారుస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా సీఈఏ గ్రూపునకు శ్రీకారం చుడుతున్నారు. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో 11, 12 తరగతుల్లో అకౌంటెన్సీ సబ్జెక్టు ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లోని కామర్స్‌ సబ్జెక్టు పేరును కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీగా మార్చుతున్నారు. ఇక కొత్త గ్రూపు సీఈఏలో ఒక సబ్జెక్టుగా అకౌంటెన్సీ ఉన్నందున అందులో కామర్స్‌ పేరు యథాతథంగా ఉంటుందని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని